Vellulli Karam Podi : మనం వంటల తయారీలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన వెల్లుల్లిని ఉపయోగిస్తూ ఉంటాము. వెల్లుల్లిని, అల్లాన్ని కలిపి పేస్ట్ గా చేసి వాడుతూ ఉంటాం. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. బీపీని, షుగర్ ను నియంత్రించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో, ఎముకలను దృఢంగా చేయడంలో, సాధారణ జలుబును తగ్గించడంలో కూడా వెల్లుల్లి సహాయపడుతుంది. ఇక వెల్లుల్లితో కారాన్ని కూడా చాలా మంది తయారు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వెల్లుల్లితో కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
వెల్లుల్లి రెబ్బలు – 15, ఎండు మిరపకాయలు – 15 నుండి 20, మినప పప్పు – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, చింతపండు – కొద్దిగా, ఉప్పు – తగినంత, కరివేపాకు – రెండు రెబ్బలు, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
వెల్లుల్లి కారం పొడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక ఎండు మిరపకాయలు వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో మరో స్పూన్ నూనె వేసి నూనె కాగిన తరువాత మినప పప్పును వేసి చిన్న మంటపై వేయించుకోవాలి. మినప పప్పు కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత వెల్లుల్లి రెబ్బలు, చింతపండును వేసి వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. పూర్తిగా చల్లారిన తరువాత జార్ లో వేసి వీటితోపాటు రుచికి తగినంత ఉప్పును కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే, ఆరోగ్యానికి మేలు చేసే వెల్లుల్లి కారం తయారవుతుంది.
ఈ వెల్లుల్లి కారాన్ని మూత ఉండే డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఈ వెల్లుల్లి కారాన్ని వేడి వేడి అన్నంలో నెయ్యితో మొదటి ముద్ద కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా దోశ, ఇడ్లీ, ఉప్మా వంటి వాటిని కూడా వెల్లుల్లి కారంతో తినవచ్చు. వెల్లుల్లి పాయలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. మనం తిన్న ఆహారాల పదార్థాల నుండి పేగులు ఐరన్ ను ఎక్కువగా గ్రహించే శక్తిని పెంచడంలో కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అలర్జీలను, దంతాల నొప్పులను తగ్గించడంలోనూ వెల్లుల్లి దోహదపడుతుంది. కనుక వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.