Jajikaya : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో జాజికాయ ఒకటి. నాన్ వెజ్ వంటకాల్లో, మసాలా కూరల్లో మాత్రమే దీనిని ఉపయోగిస్తాము. వంటల్లో దీని వాడకం తక్కువే అయినప్పటికి ఆయుర్వేదంలో దీనిని పలు రకాల అనారోగ్య సమస్యలను నివారించడంలో విరివిరిగా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. జాజికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని దీనిని ఉపయోగించడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. మన శరీరంలో వైరస్ లు ప్రవేశించినప్పుడు మన శరీరంలో ఉండే రక్షక కణాలు వాటిని నశింపజేసే ప్రక్రియలో కొన్ని రకాల రసాయనాలు విడుదల అవుతాయి.
ఈ రసాయనాలు మన శరీరంలో అలాగే ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలా విడుదలైన రసాయనాలను విచ్ఛినం చేసి మన రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో జాజికాయ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జాజికాయ పొడిని వేడి నీటిలో వేసి కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ జాజికాయను రోజుకు 15 లేదా 16 గ్రాముల కంటే ఎక్కువగా ఉపయోగించకూడదని వారు చెబుతున్నారు. ఈ మోతాదుకు మించి ఉపయోగిస్తే మేలు చేసే జాజికాయ కీడు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా జాజికాయను నీటితో అరగదీయాలి.
అరగదీయగా వచ్చిన మిశ్రమాన్ని నోటిలో ఉండే పుండ్లపై లేపనంగా రాయడం వల్ల నోటిలో పుండ్లు త్వరగా మానుతాయి. అలాగే ఈ మిశ్రమంతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. చిగుళ్ల సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. జాజికాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాలను నశింపజేసి నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అదే విధంగా జాజికాయను అరగదీయగా వచ్చిన మిశ్రమానికి తేనెను కలిపి చర్మంపై ఉండే బ్లాక్ హెడ్స్ పై లేపనంగా రాయాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత మీగడతో రుద్ది ఈ తరువాత శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలిగిపోతాయి. అలాగే మానసిక ఆందోళన, ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, డిఫ్రెషన్ వంటి వాటిని తగ్గించడంలో కూడా ఈ జాజికాయ మనకు ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు పాలల్లో జాజికాయ పొడి, బాదం పొడి, యాలకుల పొడి వేసి కలిపి తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు నిద్ర కూడా బాగా పడుతుంది. అలాగే జాజికాయను రోజూ 5 గ్రాముల మోతాదులో ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. వంటల్లో వాడడంతో పాటు ఈ విధంగా జాజికాయను ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.