మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆయుర్వేద ఔషధాల్లో శిలాజిత్తు ఒకటి. దీని గురించి చాలా మందికి తెలియదు. వివిధ రకాల పదార్థాలతో దీన్ని తయారు చేస్తారని అనుకుంటారు. కానీ అలా కాదు, ఇది స్వతహాగా ఒక పదార్థం. ఖనిజాల జాతికి చెందినది. హిమాలయాలు, హిందుకుష్ పర్వత శ్రేణులలో శిలాజిత్తు లభిస్తుంది. ఖనిజం అవడమే కాదు, ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల శిలాజిత్తు పలు అనారోగ్య సమస్యలను తగ్గించడంలో పనిచేస్తుంది.
శిలాజిత్తు లక్కలాంటి అరుదైన రెసిన్ (గుగ్గిలం). మొక్కలు, వృక్ష సంబంధ పదార్థాలు అనేక వేల సంవత్సరాల పాటు కుళ్లిపోయి రాళ్ల మధ్యలో చిక్కుకుపోతాయి. అవే నల్లగా లేదా గోధుమ రంగులో బంక వంటి పదార్థంగా మారుతాయి. దీన్నే శిలాజిత్తు అంటారు. ఆయుర్వేదంలో శిలాజిత్తును ఎన్నో వేల సంవత్సరాల నుంచే ఉపయోగిస్తున్నారు. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.
శిలాజిత్తును వాడడం వల్ల అధిక బరువు తగ్గుతారు. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. వీర్యం నాణ్యంగా ఉంటుంది. శిలాజిత్తులో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల రక్త హీనత సమస్య నుంచి బయట పడవచ్చు. అల్జీమర్స్ వ్యాధిని శిలాజిత్తు తగ్గిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు శిలాజిత్తును వాడితే ప్రయోజనం ఉంటుంది. శిలాజిత్తును వాడడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. అల్సర్లు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ, మొలలు వంటి సమస్యలను తగ్గించడంలోనూ శిలాజిత్తు బాగా పనిచేస్తుంది.
శిలాజిత్తు పొడి రూపంలో, క్యాప్సూల్స్ రూపంలో లభిస్తుంది. ద్రవ రూపంలోనూ దీన్ని విక్రయిస్తున్నారు. ఆయుర్వేద మందుల షాపుల్లో శిలాజిత్తు లభిస్తుంది.
శిలాజిత్తు క్యాప్సూల్స్‌ను రోజుకు 300 నుంచి 500 ఎంజీ మోతాదులో వాడుకోవచ్చు. ద్రవ రూపంలో ఉండే శిలాజిత్తు అయితే రోజుకు 1-3 చుక్కలు వాడాలి. పాలలో కలిపి తీసుకోవాలి. ఆయుర్వేద డాక్టర్‌ను కలిస్తే మీ ఆరోగ్య స్థితిని బట్టి శిలాజిత్తు మోతాదు ఇస్తారు. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీన్ని వాడుకోవచ్చు.
ఇక గర్భిణీలు, కీళ్ల నొప్పులు ఉన్నవారు, గౌట్ సమస్య ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు శిలాజిత్తును వాడుకోవాల్సి ఉంటుంది.