home gardening

మీ ఇంట్లోనే కీర‌దోస‌ను ఇలా పెంచండి..!

మ‌న‌లో అధిక‌శాతం మందికి ఇండ్ల‌లో కూర‌గాయ‌ల‌ను పెంచాల‌నే త‌ప‌న ఉంటుంది. కానీ కొంద‌రికి స్థ‌లాభావం వ‌ల్ల అది వీలు కాదు. ఇక స్థ‌లం ఉన్న‌వారు కూడా కూర‌గాయ‌ల‌ను ఎలా పెంచాలా..? అని సందేహిస్తుంటారు. అయితే ఇంటి ద‌గ్గ‌ర త‌గినంత స్థ‌లం ఉండేవారు పెద్ద‌గా శ్ర‌మ ప‌డ‌కుండానే సుల‌భంగా కీర‌దోసను ఇంట్లోనే పెంచ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏమేం చేయాలో, ఏమేం వ‌స్తువులు అవ‌స‌రం ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. కుండీలోనా..? స్థ‌లంలోనా..?

కీర‌దోస‌ను ఎండ‌లో పెంచాల్సి ఉంటుంది. అందుక‌ని నిత్యం క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు సూర్య‌ర‌శ్మి త‌గిలే స్థలంలో వాటిని పెంచాలి. ఇక వెడ‌ల్పాటి మూతి ఉన్న కుండీలో లేదా కావ‌ల్సిన స్థ‌లం ఉంటే అందులోనూ కీర‌దోస‌ను పెంచ‌వ‌చ్చు. అయితే కుండీ విష‌యానికి వ‌స్తే దాని వ్యాసం కనీసం 18 నుంచి 24 ఇంచులు ఉండాలి. ఎందుకంటే కీర‌దోస మొక్క పెరిగే కొద్దీ బాగా విస్త‌రిస్తుంది క‌నుక ఆ మాత్రం వెడ‌ల్పు ఉండాలి. ఇక విత్త‌నాలు నాటిన చోట 2 అడుగుల పొడ‌వైన ఓ స‌న్న‌ని క‌ర్ర‌ను కూడా మొక్క‌కు స‌పోర్ట్ కోసం పాత‌వ‌చ్చు.

you can grow cucumber in your home garden like this

2. మ‌ట్టిని సిద్ధం చేయ‌డం

కూర‌గాయల‌ను పెంచేందుకు అవ‌స‌రం ఉన్న మ‌ట్టిని కీర‌దోస పెంప‌కానికి వాడాలి. సాధార‌ణ తోట మ‌ట్టిలో క‌లుపు మొక్క‌లు బాగా పెరుగుతాయి. అలాగే అందులో హానికార‌క బాక్టీరియా కూడా ఉంటుంది. క‌నుక ఆ మ‌ట్టిని వాడ‌కూడ‌దు. ప్ర‌త్యేకంగా సిద్ధం చేసుకున్న మ‌ట్టిలో సేంద్రీయ ఎరువులు క‌లిపి ఆ మ‌ట్టిని కీర‌దోస పెంప‌కం కోసం వాడాలి. ఆ మ‌ట్టిలో మొక్క‌ల‌కు అన్ని ర‌కాల మిన‌రల్స్ అందేలా చూసుకోవాలి. నైట్రోజ‌న్‌, పొటాషియం, పాస్ఫ‌ర‌స్ త‌దిత‌ర పోష‌కాలు మొక్క‌ల‌కు అందేలా మ‌ట్టిని సిద్ధం చేయాలి.

3. విత్త‌నాలు నాట‌డం

కీర‌దోస విత్త‌నాల‌ను కేవ‌లం 1 ఇంచు లోప‌ల విత్తుకుంటే చాలు. త్వ‌ర‌గా మొల‌క‌లు వ‌స్తాయి. ఇక విత్త‌నానికి, విత్త‌నానికి న‌డుమ క‌నీసం 6 ఇంచుల స్థ‌లం వ‌ద‌లాలి. విత్త‌నాలు విత్తాక వాటిపై మ‌ట్టి క‌ప్పి.. కొంచెం నీరు పోస్తే చాలు. మొల‌క‌లు త్వ‌ర‌గా వ‌చ్చి మొక్క‌లు పెరుగుతాయి.

4. నీళ్లు ప‌ట్ట‌డం

విత్త‌నాల‌ను నాట‌డంతోనే మ‌న ప‌ని అయిపోతుంద‌ని భావించ‌కూడ‌దు. విత్త‌నాలు మొల‌క‌లుగా మారి, అవి మొక్క‌లుగా పెరిగి, కాపు కాసే వ‌ర‌కు వాటి సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లను మ‌రువ‌కూడ‌దు. ముఖ్యంగా కాయ‌లు ఎక్కువ‌గా రావాలంటే నీటిని బాగా పోయాల్సి ఉంటుంది. క‌నీసం ప్ర‌తి 10 రోజుల‌కు ఒక‌సారి అయినా సేంద్రీయ ఎరువుల‌ను వేయాలి. మొక్క‌లు పెరిగేట‌ప్పుడు చీడ పీడ‌లు ప‌ట్ట‌డం స‌హ‌జ‌మే. అయితే వీటిని బేకింగ్ సోడా – నీరు మిశ్ర‌మం లేదా నీమ్ ఆయిల్ స్ప్రేల‌తో వ‌దిలించుకోవ‌చ్చు. క్రిమి సంహార‌క మందుల‌ను వాడాల్సిన ప‌నిలేదు. ఇక మొక్క‌ల‌కు త‌గినంత సూర్య‌ర‌శ్మి అందేలా చూసుకుంటే చాలా వ‌ర‌కు చీడ పీడ‌ల బాధ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. మొక్క‌లు పెరిగే క్ర‌మంలో చీడ పీడ‌ల బారిన ప‌డ్డ ఆకులు, పువ్వుల‌ను కోసేయాలి. దీంతో ఇత‌ర ఆకులు, పువ్వుల‌కు అవి వ్యాప్తి చెంద‌కుండా ఉంటాయి. అయితే చెడిపోయిన ఆకులు, పువ్వుల‌ను ఉద‌యాన్నే తొల‌గిస్తే మంచిది.

5. పండిన పంటను నిల్వ చేయ‌డం

కీర‌దోస పండేందుకు సుమారుగా 50 నుంచి 70 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. అయితే పంట పండ‌గానే కాదు, స‌రైన స‌మయంలో పంట‌ను తీయ‌డం కూడా ముఖ్య‌మే. పువ్వులు వ‌చ్చిన 10 రోజుల త‌రువాత కీర‌దోస కాయ‌ల‌ను కోయాల్సి ఉంటుంది. కీర‌దోస కాయ‌లు ప‌సుపు రంగులోకి మారితే అవి చేదుగా ఉంటాయి. క‌నుక ఆ స్థితికి రాక మునుపే కాయ‌ల‌ను కోయాల్సి ఉంటుంది. ఇక కాయ కాండానికి కొద్దిగా పైకే కాయ‌ల‌ను కోస్తే త‌రువాత కొత్త కాయ‌లు వ‌చ్చేందుకు, పువ్వులు బాగా పూసేందుకు అవ‌కాశం ఉంటుంది. కోసిన కాయలు స‌హ‌జంగానే 3 రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటాయి. ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే కోసిన వెంట‌నే శీత‌ల వాతావ‌ర‌ణంలో కాయ‌ల‌ను ఉంచాలి. ఇలా ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే త‌గినంత స్థ‌లం ఉండే వారు కీర‌దోసను చ‌క్కగా పెంచుకోవచ్చు.

Admin

Recent Posts