Acidity : అసిడిటీ.. దీన్నే కడుపులో మంట అని కూడా పిలుస్తారు. కారణాలు ఏమున్నప్పటికీ కడుపులో మంటగా ఉంటే మాత్రం అసలు సహించదు. కూర్చున్నా.. పడుకున్నా.. కడుపులో అంతా మంటగా ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే కడుపులో మంటను వెంటనే తగ్గించుకునేందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌లను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో సహజసిద్ధంగా లభించే పదార్థాలతోనే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కడుపులో బాగా మంటగా ఉంటే ఒక అరటి పండును పూర్తిగా తినేయాలి. పూటకు ఒక అరటి పండు చొప్పున తింటుంటే వెంటనే కడుపులో మంట తగ్గిపోతుంది. అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధమైన అంటాసిడ్‌గా పనిచేస్తుంది. కనుక కడుపులో మంటగా ఉన్నప్పుడు ఒక అరటి పండును తింటే వెంటనే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అయితే బాగా పండిన అరటి పండు అయితే ఇంకా మంచిది. దీంతో త్వరగా ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. కడుపులో మంటను తగ్గించడంలో తులసి ఆకులు కూడా బాగానే పనిచేస్తాయి. వీటిలోనూ సహజసిద్ధమైన అంటాసిడ్ గుణాలు ఉంటాయి. కనుక ఈ సమస్య ఉన్నప్పుడు 5 లేదా 6 తులసి ఆకులను నేరుగా నమిలి తినవచ్చు. లేదా వాటి నుంచి తీసిన రసాన్ని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి అయినా తాగవచ్చు. దీంతో అసిడిటీ నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
3. పాలు వేడిగా ఉన్నప్పుడు ఆమ్లత్వ గుణాన్ని కలిగి ఉంటాయి. కానీ చల్లగా ఉన్నప్పుడు అవి ఆమ్లత్వాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కనుక అసిడిటీ ఉన్నవారు పాలను బాగా చల్లగా చేసుకుని ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. పాలను మరిగించి చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత ఒక గంట అయ్యాక ఆ పాలను తాగాలి. అందులో కాస్త నెయ్యి కలిపి తాగితే ఇంకా త్వరగా ఉపశమనం లభిస్తుంది. కానీ పాలలో ఎట్టి పరిస్థితిలోనూ చక్కెర కలపరాదు. తాగితే నేరుగా చల్లని పాలనే తాగాలి. లేదా కుదిరితే నెయ్యి కలిపి తాగవచ్చు. దీంతో కడుపులో మంట వెంటనే తగ్గిపోతుంది.
4. గుప్పెడు సోంపు గింజలను తీసుకుని వాటిని గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ సోంపును తిని ఆ నీళ్లను తాగేయాలి. దీంతో రోజంతా గ్యాస్, కడుపులో మంట రాకుండా ఉంటాయి.
5. రెండు టీస్పూన్ల జీలకర్రను ఒక కప్పు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు రెండు సార్లు భోజనం అనంతరం తాగాలి. దీంతో కడుపులో మంట తగ్గిపోతుంది.
6. కడుపులో మంటను తగ్గించడంలో లవంగాలు కూడా అద్భుతంగానే పనిచేస్తాయి. భోజనం అనంతరం ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నమిలి మింగాలి. ఇలా చేస్తుంటే అసిడిటీతోపాటు అజీర్ణం, గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి.
7. భోజనం అనంతరం ఒక యాలక్కాయను నోట్లో వేసుకుని నమిలి మింగుతున్నా అసిడిటీ తగ్గుతుంది. అంతేకాదు.. ఆహారం సులభంగా.. త్వరగా జీర్ణమవుతుంది.
8. గుప్పెడు పుదీనా ఆకులను తీసుకుని వాటి నుంచి రసం తీయాలి. దాన్ని భోజనం అనంతరం నేరుగా తాగవచ్చు. లేదా గ్లాస్ మజ్జిగలో కలిపి కూడా తాగవచ్చు. దీని వల్ల కూడా కడుపులో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు.
9. రోజూ ఉదయాన్నే పరగడుపునే 1 టీస్పూన్ అల్లం రసం సేవిస్తే ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు. లేదా ఒక చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని కప్పు మోతాదులో రోజుకు రెండు సార్లు తాగాలి. దీని వల్ల కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
10. రోజూ పరగడుపునే ఉసిరికాయ రసాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగుతుండాలి. దీని వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు అయినా సరే తగ్గుతాయి.