Motimalu : నేటి తరుణంలో మనల్ని ఇబ్బంది పెడుతున్న చర్మ సంబంధిత సమస్యల్లో మొటిమలు ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు. యుక్త వయసులో ఉన్న వారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. హార్మోన్ల అసమతుల్యత, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నీటిని ఎక్కువగా తాగకపోవడం వంటి వివిధ కారణాల చేత చర్మం పై మొటిమలు వస్తూ ఉంటాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి వివిధ రకాల ఫేస్ వాష్ లను, క్రీములను వాడుతూ ఉంటారు. ఈ మొటిమలను సహజ సిద్ద ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా మనం తగ్గించుకోవచ్చు. మొటిమలను నివారించే ఒక చక్కటి ఇంటి చిట్కాను తయారు చేసుకోవడానికి వాడవల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను వాడడం వల్ల మొటిమల వల్ల వచ్చే మచ్చలు, గుంతలు కూడా తొలగిపోతాయి. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం 8 నుండి 10 తులసి ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది. తులసి ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. తులసి ఆకులను వాడడం వల్ల ముఖం పై వచ్చే మచ్చలు, మొటిమలు తగ్గడంతో పాటు దెబ్బ తిన్న చర్మం కూడా తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. అలాగే ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక కర్పూరం బిళ్లను ఉపయోగించాల్సి ఉంటుంది. కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కర్పూరాన్ని వాడడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటు మొటిమల వల్ల కలిగే వాపు, నొప్పి కూడా తగ్గుతుంది.
చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. అలాగే మనం ఉపయోగించాల్సిన మరో పదార్థం వేపాకు పొడి. ఒక టీ స్పూన్ మోతాదులో ఈ పొడిని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పొడి అందుబాటులో లేని వారు దీనికి బదులుగా వేపాకులను పేస్ట్ గా చేసుకుని కూడా వాడవచ్చు. వేపాకు పొడిని ఉపయోగించడం వల్ల మొటిమలు, ముఖం పై ఉండే మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఇక చివరగా మనం వాడవల్సిన పదార్థం కొబ్బరి నూనె. మన జుట్టుకే కాకుండా మన చర్మానికి కూడా కొబ్బరి నూనె మేలు చేస్తుంది.
మొటిమలు అలాగే వాటి వల్ల కలిగే మచ్చలను తగ్గించడంలో కొబ్బరి నూనె మనకు దోహదపడుతుంది. దీనిని వాడడం వల్ల చర్మం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. ఈ పదార్థాలతో మొటిమలను తగ్గించే మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తులసి ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక కర్పూరం బిళ్లను వేసి మెత్తని పేస్ట్ గా చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ వేపాకుల పొడిని, ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను వేసి బాగా కలపాలి. ఆయిల్ స్కిన్ ఉన్న వారు కొబ్బరి నూనెతో పాటు అర చెక్క నిమ్మరసాన్ని కూడా ఈ మిశ్రమంలో వేసి కలపాలి. పొడి చర్మం ఉన్న వారు నిమ్మరసాన్ని ఉపయోగించకూడదు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వాడడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. కనీసం ఈ ప్యాక్ ను 20 నుండి 25 నిమిషాల పాటు ఇలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి మూడు నుండి నాలుగు సార్లు వాడడం వల్ల మొటిమల సమస్య నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల మచ్చలు, ఇతర చర్మ సమస్యలు తగ్గి చర్మం అందంగా కాంతివంతంగా తయారవుతుంది.