Pigmentation Home Remedies : మనల్ని వేధించే వివిధ రకాల చర్మ సమస్యలల్లో మంగు మచ్చలు కూడా ఒకటి. స్త్రీ, పురుష బేధం లేకుండా అందరికి ఈ సమస్య వస్తున్నప్పటికి మగ వారితో పోలిస్తే ఆడవారిలో మంగు మచ్చలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మంగు మచ్చల వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. ఈ మచ్చలు రావడానికి వివిధ కారణాలు ఉంటాయి. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కూడా మంగు మచ్చలు వస్తాయి. చర్మం లోపల మెలనోసైట్స్ ఉంటాయి. ఇవి మెలనిన్ ను ఉత్పత్తి చేస్తాయి. చర్మంపై ఎక్కడైతే ఎండ ఎక్కువగా పడుతుందో ఆ భాగంలో మెలనోసైట్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో మెలనోసైట్స్ మెలనిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఆ భాగంలో చర్మం నల్లగా మారుతుంది. దీని వల్ల మంగు మచ్చలు వస్తాయి. అలాగే స్త్రీలల్లో ఈ సమస్య రావడానికి మరో కారణం కూడా ఉంది. స్త్రీలల్లో ఈస్ట్రోజన్ తగ్గి ప్రోజెస్టిరాన్ అనే హార్మోన్ పెరగడం వల్ల కూడా మంగు మచ్చలు వస్తూ ఉంటాయి.
ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు తగ్గడం వల్ల హార్మోన్ అసమతుల్యత సమస్యలు ఏర్పడతాయి. దీంతో మగ్గు మచ్చుల వచ్చే అవకాశం ఉంది. కొందరిలో ప్రోజెస్టిరాన్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల ఈ హార్మోన్ కు సంబంధించిన ఇంజెక్షన్ లను తీసుకుంటూ ఉంటారు. దీంతో కూడా మంగు మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒత్తిడి ఎక్కువగా ఉన్న వారిలో కూడా మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. అలాగే గర్భిణీ స్త్రీలల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల అసమతుల్యతల కారణంగా కూడా మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. మంగు మచ్చలతో బాధపడే వారు వాటిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు ఆయింట్ మెంట్ లను కూడా వాడుతూ ఉంటారు. ముఖంపై మంగు మచ్చలతో బాధపడే వారు ముందుగా ముఖానికి ఎండ తగలకుండా చూసుకోవాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే టోపి ధరించడం, గొడుగు పట్టుకోవడం, ముఖానికి నేరుగా ఎండ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అలాగే మంగు మచ్చలు తగ్గాలంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలి.
దీని కోసం సోయా బీన్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. సోయా బీన్స్ లో మొక్కలల్లో ఉండే ఫైటో ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మనలో 40 నుండి 50 శాతం ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. కనుక సోయా బీన్స్ ను తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగి మంగు మచ్చలు తగ్గుతాయి. అలాగే మంగు మచ్చలు ఉన్న భాగంలో తేనెను రాసి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ భాగంలో ఉండే ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మంగు మచ్చలు తగ్గుతాయి. అయితే ఈ మంగు మచ్చలు వెంటనే తగ్గవు. ఇవి తగ్గడానికి ఆరు నెలల నుండి సంవత్సరం సమయం కూడా పట్టవచ్చు. మన జీవన శైలిలో మార్పు చేసుకోవడం వల్ల క్రమంగా ఈ సమస్య తగ్గుతుంది.