Pimples : మనల్ని వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా మనలో చాలా మంది అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. మొటిమలతో పాటు వాటి వల్ల కలిగే నొప్పి, మచ్చలు, గుంతలు మనల్ని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ముఖం పై మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, చర్మం పై దుమ్ము, ధూళి పేరుకుపోవడం, చర్మం జిడ్డుగా ఉండడం, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాల చేత ముఖం పై మొటిమలు వస్తూ ఉంటాయి. ఈ సమస్య నుండి బయట పడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అయినప్పటికి మొటిమలు తగ్గక ఇబ్బందిపడుతూ ఉంటారు. ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం చాలా సులభంగా ముఖం పై వచ్చే మొటిమలతో పాటు చర్మం పై ఉండే జిడ్డును కూడా తొలగించుకోవచ్చు. మొటిమలను నివారించే ఇంటి చిట్కాల గురించి అలాగే ఈ చిట్కాలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం 20 ఎమ్ ఎల్ బాదం పాలను, 10 ఎమ్ ఎల్ రోజ్ వాటర్ ను, 3 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును, 10 చుక్కల బాదం నూనెను, ఒక విటమిన్ ఇ క్యాప్సుల్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. బాదం పాలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బాదం పప్పును నానబెట్టి మిక్సీ లో వేసి మెత్తగా పేస్ట్ గా చేయాలి. తరువాత ఈ పేస్ట్ ను ఒక వస్త్రంలోకి తీసుకుని చేత్తో గట్టిగా పిండిగా వచ్చిన బాదం పాలను సేకరించాలి. ఇలా చేయడం వల్ల బాదం పాలు తయారవుతాయి. ఒక గిన్నెలో ఈ బాదం పాలతో పాటు పైన తెలియజేసిన పదార్థాలన్నీంటిని వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను వాడడం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది. మొటిమలతో మొటిమల వల్ల కలిగే మచ్చలు తగ్గుతాయి. అలాగే చర్మం పై జిడ్డు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే మొటిమలను తగ్గించడంలో కలబంద గుజ్జు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని చర్మానికి రాసుకుని ఆరిన తరువాత నీటితో కడిగి వేయాలి.
ఈ కలబంద గుజ్జును వాడడం వల్ల దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాలను నశింపజేయడంలో వాటి వల్ల చర్మం పై కలిగే ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. అలాగే దీనిని వాడడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ఈ రెండు చిట్కాలను వాడడానికి పది నిమిషాల ముందు ముఖానికి ఆవిరి పట్టుకుంటే చాలా మంచిది. ఇలా ముఖానికి ఆవిరి పట్టుకోవడం వల్ల చర్మ కణాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు చెమట రూపంలో బయటకు వస్తాయి. ఇలా ఆవిరి పట్టిన తరువాత ఈ రెండు చిట్కాల్లో ఏ చిట్కాను ఉపయోగించినా కూడా మొటిమల సమస్య నుండి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.