Potato Skin : వంటింట్లో మనం వాడే కూరగాయల్లో ఆలుగడ్డకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా చర్మ సంబంధ విషయాల్లో ఎన్నో సమస్యలతో పోరాడడానికి ఇది సహకరిస్తుంది. అయితే చర్మానికి సంబంధించి చర్మంపై మచ్చలు రావడం, చర్మం రంగులో తేడాలు ఉండడం మొదలైనవి తరచూ వచ్చే సమస్యలు. చర్మ సంరక్షణ సరిగా తీసుకోక పోవడం, సూర్యరశ్మి తగలడం ఇంకా హైపర్ పిగ్మెంటేషన్ వల్ల చర్మం రంగులో తేడాలు రావడం జరుగుతుంటుంది. ఇంకా చర్మం అతుకులుగా మారి మేకప్ వేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఆలుగడ్డ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆలుగడ్డలో పుష్కలంగా లభించే జింక్, ఐరన్, ప్రొటీన్ ఇంకా అజెలైక్ యాసిడ్ మొదలైనవి చర్మంపై నల్ల మచ్చలను తగ్గించి స్కిన్ టోన్ ని పెంచుతాయి. దాని వల్ల చర్మంపై నిగారింపు వస్తుంది. కొన్ని రోజుల పాటు ఆలుగడ్డ జ్యూస్ తాగడం వలన చర్మంపై నల్ల మచ్చలు, మొటిమల ద్వారా ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి. చాలా మంది మహిళలు చర్మ సమస్యలకు వివిధ రకాల రసాయనాలతో కూడిన క్రీములను వాడుతూ ఉంటారు. అయితే ఈ క్రీములు దీర్ఘ కాలంలో హాని కారకంగా మారుతాయి. కానీ ఆలుగడ్డలోని సహజ సిద్ధమైన గుణాలు చర్మ సమస్యలపై రసాయనాల కంటే మెరుగ్గా పని చేస్తాయి. ఇక ఆలుగడ్డ తొక్క ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చర్మంపై అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
ఇప్పుడు మనం ఆలుగడ్డ తొక్కని ఎలా వాడాలో తెలుసుకుందాం. ముందుగా ఆలుగడ్డలని బాగా కడిగి వాటి తొక్కను తొలగించాలి. ఈ తొక్కను తీసుకొని ముఖంపై నెమ్మదిగా రుద్దాలి. తరువాత దానిని అలాగే 5 నుండి 10 నిమిషాల వరకు ముఖంపై ఉంచాలి. ఆ తరువాత తొక్కని తీసేసి ముఖాన్ని చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం సున్నితంగా మారి ముఖంపై సహజమైన నిగారింపు వస్తుంది.
ఈ ఆలు తొక్కలను టమాటా గుజ్జుతో కలిపి దీనిలో కొంచెం పసుపు కూడా కలుపుకొని ముఖంపై ప్యాక్ లాగా అప్లై చేసి 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత చల్లని నీళ్లతో కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన చర్మం మొద్దుబారడం తగ్గి నల్లని మచ్చలు తొలగిపోతాయి. అలాగే ఫ్రిజ్ లో ఉంచి చల్లబరిచిన ఆలూ తొక్కలను కళ్ల కింద ఉంచడం వలన కళ్ల కింద ఉండే నల్లని మచ్చలు ఇంకా కళ్ల కింద ఉబ్బెత్తుగా ఉండడం లాంటివి తొలగిపోతాయి. ఆలుగడ్డ తొక్కలతో ఈ విధంగా చేయడం వలన ఎన్నో రకాల చర్మ సమస్యలనుండి బయటపడవచ్చు. దీంతో చర్మం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటుంది.