Carrots For Hair : నేటి తరుణంలో మనలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జుట్టు దువ్వినప్పుడు, తలస్నానం చేసినప్పుడు జుట్టు మరీ ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, రసాయనాలు కలిగిన షాంపులను ఎక్కువగా వాడడం, చుండ్రు, వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ను అనుసరించడం, తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి వివిధ కారణాల వల్ల జుట్టు రాలడం అనే సమస్య తలెత్తుతుంది. ఒక ఇంటి చిట్కాను ఉపయోగించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనం జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.
జుట్టును ఒత్తుగా మార్చే ఇంటి చిట్కా ఏమిటి.. ఈ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేయడానికి గానూ మనం క్యారెట్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. క్యారెట్ కేవలం కంటి చూపును మెరుగుపరచడంలోనే కాదు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగా ఒక పెద్ద క్యారెట్ ను తీసుకుని ముక్కలుగా చేయాలి. తరువాత ఈ ముక్కలను నీటిలో వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ కు తగినంత కొబ్బరినూనె లేదా బాదం నూనె, ఆలివ్ నూనె, ఆవ నూనె ఇలా మనకు నచ్చిన నూనెను కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించాలి. ఇలా పట్టించిన గంట తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల జుట్టు కుదుళ్లు ధృడంగా మారతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ, కెరటనాయిడ్లు లు జుట్టును ఆరోగ్యంగా మెరిసేలాగా చేయడంలో సహాయపడతాయి. ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల తలలో ఉండే చుండ్రు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ లు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఈ చిట్కాను పాటించడం వల్ల పొడి బారిన జుట్టు కూడా నిగారింపును సొంతం చేసుకుంటుంది. జుట్టు చిట్లడం, జుట్టు తెగడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే మనం తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.