Gas Trouble : మనల్ని వేధించే అనేక అనారోగ్య సమస్యల్లో పొట్టలో గ్యాస్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో చిన్నా పెద్దా అనే లేడా లేకుండా అందరూ బాధపడుతూ ఉంటారు. ఆహార నియమాలను పాటించక పోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడితోపాటు పులుపు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం, మలబద్దకం తదితర కారణాల వల్ల మనం గ్యాస్ సమస్య బారిన పడుతూ ఉంటాం. గ్యాస్ సమస్య కారణంగా కడుపులో మంట, అజీర్తి, ఆకలి లేకపోవడం, కడుపులో నొప్పి, పుల్లటి త్రేన్పులు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. మనం రోజూతినే ఆహారంతోపాటు మన జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేయడం వల్ల మనం ఈ సమస్య నుండి తేలికగా బయటపడవచ్చు.
మనం చేసే పనిలో నిమగ్నమైపోయి వేళకు తినని వారు చాలా మందే ఉంటారు. గ్యాస్ సమస్య రావడానికి ప్రధాన కారణం సమయానికి భోజనం చేయకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. సమయానికి భోజనం చేయడం వల్ల మనం ఈ సమస్య బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే కడుపును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. మధ్య మధ్యలో పండ్లను కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి. మనకు పండ్లు కూడా అందుబాటులో లేనప్పుడు కనీసం మంచి నీళ్లనైనా తాగుతూ ఉండాలి. అలాగే మనం తినే ఆహారంలో మసాలాలను, పులుపును ఉపయోగించడం తక్కువ చేయాలి. బయట దొరికే శీతల పానీయాలను తాగకూడదు. ధూమపానం అలవాటును కూడా మానాలి.
ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఆందోళనకు, ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలి. అదేవిధంగా ఉదయాన్నే పరగడుపునే గోరు వెచ్చని నీటిలో అల్లం రసాన్ని , తేనెను కలిపి తీసుకోవాలి. అదే విధంగా గోరు వెచ్చని నీటిలో ఉప్పు, వాము పొడి, అల్లం రసం, నిమ్మ రసం కలిపి తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. వాము పొడిని, సోంపు పొడిని కలిపి రెండు పూటలా తీసుకోవడం వల్ల, అలాగే చిన్న అల్లం ముక్కకు ఉప్పును రాసి నేరుగా తినడం వల్ల కూడా గ్యాస్ సమస్య బారిన పడకుండా ఉంటాం.
పుదీనా ఆకులను మరిగించిన నీటిని తాగడం వల్ల, రోజూ ఉదయం ఆరు తులసి ఆకులను తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తూ ఆహారంలో, జీవన విధానంలో మార్పులు చేయడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. ఈ సమస్య వచ్చిన తరువాత బాధపడడం కన్నా.. రాకముందే జాగ్రత్తలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.