Overweight : ప్రస్తుత తరుణంతో మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు తగ్గడానికి మనం రకరకరాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. బరువు తగ్గడానికి వాకింగ్, యోగా, వ్యాయామాలు చేయడంతోపాటు డైటింగ్ చేయడం, కచ్చితమైన ఆహార నియమాలను పాటించడం వంటివి చేస్తూ ఉంటారు. వీటితోపాటు బరువు తగ్గడానికి కొన్ని సార్లు ఇష్టమైన ఆహార పదార్థాలను కూడా తినడం మానేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్, మాంసాహార ఉత్పత్తులు, బిర్యానీ వంటి వాటిలో కొవ్వులు, కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న కారణంగా వాటిని తినకుండా డైటింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు వీటిని తింటూనే బరువు తగ్గవచ్చు. అవును.. జంక్ ఫుడ్, మాంసాహార ఉత్పత్తులు, బిర్యానీ వంటి వాటిని తిన్న మరుసటి రోజంతా ఏమీ తినకుండా కేవలం నీటిని లేదా నిమ్మరసం, తేనె కలిపిన నీటిని మాత్రమే తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనం తిన్న ఆహారం నుండి వచ్చే శక్తి అయిపోయిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.
శరీరానికి కావల్సిన శక్తి కోసం పిట్యూటరీ గ్రంథి గ్రోత్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ గ్రోత్ హార్మోన్ శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కణాలను చిన్న చిన్న కొవ్వు కణాలుగా విభజించడమే కాకుండా కాలేయాన్ని ఉత్తేజపరిచి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనే మరో హార్మోన్ విడుదల అయ్యేలా చేస్తుంది. కాలేయం నుండి విడుదలైన ఈ హార్మోన్ శరీరంలో పేరుకు పోయిన కొవ్వును కరిగించి చక్కెర(గ్లూకోజ్)లా మార్చుతుంది. ఈ గ్లూకోజ్ రక్తంలో కలవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది.
కేవలం నీటిని మాత్రమే తాగడం వల్ల శరీరంలో కొవ్వు కరిగి త్వరగా బరువు తగ్గుతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారు వారానికి ఒకసారి ఇలా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా, కేవలం నీటిని మాత్రమే తాగడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా నీటిని మాత్రమే తాగి ఉండడాన్ని వాటర్ ఫాస్టింగ్ లేదా వాటర్ డైట్ అని అంటారు.
కేవలం నీటిని మాత్రమే తాగి ఉండడం వల్ల కొందరిలో నీరసం, తల తిరగడం వంటివి జరుగుతాయి. అలాంటప్పుడు నిమ్మ రసం, తేనె కలిపిన నీటిని లేదా కొబ్బరి నీళ్లను తాగవచ్చు. వ్యాయామం, యోగా, వాకింగ్ వంటి వాటిని చేయడంతోపాటు ఇలా వాటర్ డైటింగ్ చేయడం వల్ల ఇష్టమైన ఆహార పదార్థాలను తింటూనే వేగంగా బరువు తగ్గవచ్చు. అంతే కాకుండా కాలేయం పని తీరు కూడా మెరుగుపడుతుంది.