Biyyam Rava Java : మనం బియ్యంతో పాటు బియ్యం రవ్వను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో ఉప్మా వంటి వాటినే కాకుండా వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ బియ్యం రవ్వతో ఎంతో రుచిగా జావను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ జావ తేలికగా జీర్ణమవ్వడంతో పాటు శరీరానికి కావల్సినంత శక్తిని కూడా ఇస్తుంది. బియ్యం రవ్వతో తేలికగా, రుచిగా జావను ఎలా తయారు చేసుకోవాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం రవ్వ జావ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం రవ్వ – ఒక టీ గ్లాస్, నీళ్లు – ఏడు టీ గ్లాసులు, ఉప్పు – తగినంత.
బియ్యం రవ్వ జావ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు వేసి నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేసి కలపాలి. రవ్వను ఉండలు లేకుండా కలుపుకుని మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యం రవ్వ జావ తయారవుతుంది. దీనిని ఆవకాయ పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆవకాయ పచ్చడి వద్దనుకున్న వారు ఇందులో మజ్జిగను కూడా కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా బియ్యం రవ్వతో జావను తయారు చేసుకుని తినడం వల్ల శరీరానికి శక్తి లభించడంతో పాటు తేలికగా కూడా ఉంటుంది. అలాగే శరీరానికి చలువ కూడా చేస్తుంది. ఆరోగ్యం బాలేనప్పుడు ఇలా తేలికగా జీర్ణమయ్యేలా బియ్యం రవ్వతో జావను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.