Germs : నేటి కాలంలో తరచూ పిల్లలతోపాటు పెద్దలు కూడా కడుపునొప్పితో బాధపడుతున్నారు. కొందరిలో కడుపులో మెలి పెట్టేసినట్టు ఉండడం, కడుపు నొప్పి అధికంగా రావడం వంటివి జరుగుతుంటాయి. ఇలా కనుక జరిగితే మీ కడుపులో నులి పురుగులు ఉన్నట్టే. అన్ని వయసుల వారికి కడుపులో నొప్పి రావడం సహజమే అయినా చిన్న పిల్లల్లో మాత్రం ఎక్కువగా వస్తుంది. నొప్పి రావడానికి నులి పురుగులే కారణమని ఇలా తరచూ పిల్లల్లో కడుపు నొప్పి రావడం వారి ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అసలు నులి పురుగులు అంటే ఏమిటి.. అవి కడుపులోకి ఎందుకు వెళతాయి.. ఎలా వెళతాయి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మట్టిలో మన కంటికి కనిపించకుండా అనేక రకాల చిన్న చిన్న పురుగులు ఉంటాయి. చిన్న పిల్లలు ఆటలు ఆడుకోడానికి బయటికి వెళుతుంటారు. నేలపై ఆటలు ఆడుతుంటారు. అప్పుడు ఆ సూక్ష్మ రూపంలో ఉన్న పురుగులు చేతి గోర్ల ద్వారా కడుపులోకి వెళుతుంటాయి. అవి నులి పురుగులుగా మారి కడుపులోని ప్రేగుల్లో నివాసం ఉంటాయి. అవి బాగా పొడువుగా మారి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలు సహజంగా రక్తంలోకి చేరతాయి.
కానీ నులిపురుగులు మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను రక్తంలో కలవకుండా చేస్తాయి. ఆ పోషకాలను నులిపురుగులే గ్రహిస్తాయి. దాంతో తరచూ పిల్లలు అనారోగ్యాల బారిన పడడం, కడుపు నొప్పి బారిన పడడం జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడం వల్ల పిల్లల్లో ఆకలి మందగిస్తుంది. ఒక్కోసారి ఈ నులిపురుగుల కారణంగా ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. ఈ నులిపురుగుల సమస్య నుండి ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా బయట పడవచ్చు. నులిపురుగులను నివారించే ఆయుర్వేద ఔషధాలు ఏమిటి.. వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
నులిపురుగులను నివారించడంలో ఉల్లిపాయ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలను మెత్తగా చేసి వాటి నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ప్రతిరోజూ తాగడం వల్ల నులిపురుగులు నశించి కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే దానిమ్మ జ్యూస్ కు కడుపులో ఉండే నులిపురుగులను, సూక్ష్మ క్రిములను నాశనం చేసే గుణం ఉంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు పొట్టను కూడా శుభ్రం చేసి నులి పురుగులను అంతం చేస్తాయి. అన్ని రకాల ఆకుకూరల జ్యూస్ లను, కొత్తిమీర జ్యూస్ ను, కీర దోస జ్యూస్ ను ప్రతిరోజూ తీసుకుంటే పొట్టలోని నులిపురుగులు నశించి కడుపు నొప్పి రాకుండా ఉంటుంది.
వీటిని పాటిస్తూనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కూరగాయలను, పండ్లను నీటితో శుభ్రంగా కడిగిన తరువాతే ఆహారంగా తీసుకోవాలి. అన్నం తినే ముందు కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి అన్నీ పాటించడం వల్ల నులిపురుగుల సమస్య నుండి బయట పడడమే కాకుండా అనారోగ్యాల బారిన కూడా పడకుండా ఉంటాం.