నిజమే. నగ్నంగా స్నానం చెయ్యకూడదని శాస్త్రం చెబుతోంది. గోపిక వస్త్రాపహరణ వృత్తాంతంలో ఈ నియమం నిరూపించబడింది. కృష్ణుడే భర్తగా లభించాలని గోపికలు ఒక వ్రతం చేశారు. ముందుగా వ్రతస్నానం చెయ్యటానికి ఒక కొలనుకు వెళ్లారు. వస్త్రాలు విడిచి గట్టున పెట్టి నీళ్లలో దిగారు. అంటే అపచారం చేశారన్నమాట.
శాస్త్రం ఏమి చెప్పింది? ననగ్నో స్నాతి క్వచిత్- ఏ వేళైనా నగ్నంగా స్నానం చెయ్యకూడదు. ఎందువల్ల? జలానికి అధిదేవత వరుణుడు. ఆ దేవుడిని గోపికలు అగౌరవం చేసినట్లయింది. ఏ దేవుడికి అపచారం చేసినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలా? ఏ దేవుడులోనైనా అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు. ఆయన కృష్ణపరమాత్మ. గోపికలు చేసిన అపచారానికి వాళ్ళచేత ప్రాయశ్చిత్తం చేయించటానికి కృష్ణడక్కడికి వచ్చాడు. గట్టుమీద ఉన్న చీరల్ని తీసుకొని చెట్టుమీదకి ఎక్కాడు. గోపికలు కుయ్యో మొర్రో అన్నారు. మీరు అపచారం చేసారు. ప్రాయశ్చిత్తంగా అందరూ నాకు నమఃస్కరించండి అన్నాడు కొంటె కృష్ణుడు!
గోపికలు సిగ్గుపడుతూ, ఒక చెయ్యి వంటిమీద వేసుకుని, రెండో చెయ్యి పైకెత్తి నమస్కారం చేసారు. అబ్బే! అదేమీ నమస్కారం పెట్టడం? రిక్త హస్తస్వచ్చేదః అన్నాడు. వాళ్ళు రెండు చేతులు జోడించిన వెంటనే వాళ్ళ విలువలు, వలువలు ఇచ్చేసాడు. అందువల్ల ఒంటిమీద ఆచ్చాదన లేకుండా స్నానం చెయ్యటం, ఒంటి చేత్తో వందనం చేయటం పనికిరావు.