Giloy : తిప్ప తీగ.. ఆయుర్వేదంలో ఈ మొక్కను అనేక రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. తిప్ప తీగను మనలో చాలా మంది చూసే ఉంటారు. ఇది ఎక్కడ పడితే అక్కడ ఇతర చెట్లకు అల్లుకుని ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దీనిని అమృతవల్లి అని కూడా అంటారు. ఈ మొక్క చనిపోయిన ఆరు నెలల తరువాత మరలా నీళ్లు పోసిన కూడా తిప్ప తీగ మొక్క తిరిగి చక్కగా పెరుగుతుంది. అయితే చాలా మంది దీనిని పిచ్చి మొక్కగా భావించి పీకేస్తూ ఉంటారు. కానీ దీనిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో ఎంతో కాలంగా దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క కారం, వగరు రుచులను కలిగి ఉంటుంది.
మనకు ఆయుర్వేద షాపుల్లో అలాగే ఆన్ లైన్ లో తిప్ప తీగ జ్యూస్ చాలా సులభంగా లభిస్తుంది. తిప్ప తీగ వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తిప్ప తీగ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తిప్పతీగను ఉపయోగించడం వల్ల వాతం, రక్తదోషాలు, పాండు రోగం, వాంతులు, దురద, శ్లేష్మం, జ్వరము వంటి రోగాలు నయం అవుతాయి. అలాగే తిప్ప తీగ పొడిని బెల్లంతో తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. పంచదారతో తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. ఆముదంతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే వాతం తగ్గుతుంది. తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కఫం సమస్య తగ్గు ముఖం పడుతుంది. జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడే వారు తిప్పతీగను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
అలాగే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి శరీరాన్ని అనారోగ్యానికి గురి కాకుండా చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా తిప్ప తీగలో డయాబెటిస్ ను అదుపులో ఉంచే లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు తిప్ప తీగను వాడడం వల్ల మధుమేహాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవచ్చు. అదే విధంగా తిప్ప తీగలో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీనిని ఉపయోగించడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. జలుబు, దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు తిప్ప తీగను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
దీనిని ఉపయోగించడం వల్ల ఫ్లూ, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. అదే విధంగా దీనిని ఉపయోగించడం వల్ల వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గి అందమైన ముఖం మన సొంతమవుతుంది. ఈ విధంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో తిప్ప తీగ మొక్క మనకు ఎంతో సహాయపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.