Palli Pakoda : పల్లీలు.. ఇవి మనందరికి తెలిసినవే. ఇవి ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటాయి. పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనందరికి తెలిసిందే. పచ్చళ్లు, వంటల్లో వాడడంతో పాటు పల్లీలతో మనం రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. పల్లీలతో చేసుకోదగిన చిరు తిళ్లల్లో పల్లి పకోడి కూడా ఒకటి. స్వీట్ షాపుల్లో ఇది మనకు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. రుచిగా, కరకరలాడుతూ ఉండే ఈ పల్లి పకోడీలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పల్లి పకోడీలను రుచిగా కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 200 గ్రా., శనగపిండి – 100 గ్రా., బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ప్రైకు సరిపడా, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర- 2 టేబుల్ స్పూన్స్.
పల్లి పకోడి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పల్లీలను తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి, కొత్తిమీర, పుదీనా, శనగపిండి వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని చల్లుకుంటూ పిండి పల్లీలకు పట్టేలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. చివరగా కరివేపాకును అదే నూనెలో వేసి వేయించి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పల్లి పకోడి తయారవుతుంది. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఈ పల్లి పకోడీలు చాలా చక్కగా ఉంటాయి.