Gout And Uric Acid : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం తీసుకున్న ఆహారం నుండి ఈ యూరిక్ యాసిడ్ మన శరీరానికి అందుతుంది. మన శరీరంలో ఎక్కువగా ఉన్న ఈ యూరిక్ యాసిడ్ మూత్రపిండాల ద్వారా మూత్ర రూపంలో బయటకు పోతుంది. ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అవి పూర్తి స్థాయిలో బయటకు పోవు. దీంతో యూరిక్ యాసిడ్ స్థాయిలు మన శరీరంలో విపరీతంగా పెరిగిపోతాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్ర సంబంధిత సమస్యలు, షుగర్ వ్యాధి బారిన పడడం వంటి అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల కీళ్ల మధ్య చిన్నగా నొప్పి రావడం మొదలవుతుంది. దీనిని నిర్లక్ష్యం చేయడం వల్ల కొంతకాలానికి కీళ్ల మధ్య చిన్న చిన్న స్పటికాలుగా పేరుకుపోతుంది. దీని వల్ల మన ఎముకల ఆకారం కూడా మారిపోతుంది. ఈ సమస్యనే గౌట్ అని అంటారు.
ఈ సమస్య ఎక్కువగా మద్యపానం చేసే వారిలో అలాగే మందులు ఎక్కువగా వాడే వారిలో, ప్రోటీన్లు ఎక్కువగా ఆహారాన్ని తీసుకునే వారిలో కనిపిస్తుంది. ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల వచ్చే సమస్యలను ప్రారంభదశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కేవలం మందుల ద్వారా మాత్రమే కాకుండా కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా మనం శరీరంలో ఎక్కువగా ఉన్న యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. అలాగే ఈ సమస్యతో బాధపడే వారు తినకూడని ఆహారాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా మనం ఒక గ్లాస్ సొరకాయ జ్యూస్ ను తీసుకోవాలి. తరువాత అందులో వేయించిన వాము పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేయాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ నల్ల మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న జ్యూస్ ను ఉదయం అల్పాహారం చేసిన తరువాత తీసుకోవాలి.

ఈ విధంగా సొరకాయ జ్యూస్ ను తయారు చేసుకుని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గడంతో పాటు రక్తంలో పేరుకుపోయిన ఇతర వ్యర్థ పదార్థాలు కూడా తొలగిపోతాయి. ఈ సొరకాయ జ్యూస్ క్రమంగా తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మన శరీరంలో వచ్చిన మార్పులను గమనించవచ్చు. అదే విధంగా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే మరో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో తిప్పతీగ రసం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తిప్పతీగ అందుబాటులో లేని వారు ఈ తీగ రసం మనకు ఆయుర్వేద షాపుల్లో చాలా సులభంగా లభ్యమవుతుంది. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కూడా మనం యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. అలాగే కలబంద జ్యూస్ ను, ఉసిరి కాయల జ్యూస్ ను కలిపి తీసుకోవడం వల్ల కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
కలబంద జ్యూస్ ను, ఉసిరి కాయ జ్యూస్ ను సమపాళ్లల్లో తీసుకుని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. ఈ సమస్యతో బాధపడే వారు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మద్యపానానికి దూరంగా ఉండాలి. టీ, కాఫీలను తాగడం తగ్గించాలి. మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాలను, మాంసాహారాన్ని, జంక్ ఫుడ్ ను, తీపి పదార్థాలను తీసుకోవడం చాలా తగ్గించాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్య మరలా తలెత్తకుండా ఉంటుంది.