Hair Problems : శిరోజాల సమస్యలు అనేవి సహజంగానే చాలా మందికి ఉంటాయి. జుట్టు రాలడం, చుండ్రు, పేలు, శిరోజాలు చిట్లి పోయి అందవిహీనంగా, కాంతి హీనంగా కనిపించడం.. వంటి అనేక సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే వీటన్నింటికీ ఒకే ఒక్క సహజసిద్ధమైన షాంపూతో చెక్ పెట్టవచ్చు. అవును.. మార్కెట్‌లో లభించే రసాయనాలు కలిసిన షాంపూలను వాడడం కన్నా.. మీరు మీ ఇంట్లో తయారు చేసుకున్న ఈ సహజసిద్ధమైన షాంపూ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పైన తెలిపిన జుట్టు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా మారుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. శిరోజాలు కాంతివంతంగా కనిపిస్తాయి. చుండ్రు తగ్గుతుంది. మరి ఆ సహజసిద్ధమైన షాంపూను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఉసిరి కాయలు, కుంకుడు కాయలు, శీకాకాయలు.. ఇవి జుట్టు సమస్యలన్నింటినీ తగ్గించేస్తాయి. ఉసిరికాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల జుట్టు నల్లగా మారుతుంది. దెబ్బతిన్న శిరోజాలు తిరిగి పునరుజ్జీవం పొందుతాయి. శిరోజాల కణాలు మరమ్మత్తులకు గురవుతాయి. దీంతో అవి మళ్లీ దెబ్బతినకుండా ఉంటాయి.
అలాగే కుంకుడు కాయలు కూడా శిరోజాల సంరక్షణకు బాగానే పనిచేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తాయి. దీంతో జుట్టు దెబ్బ తినడం తగ్గుతుంది.
ఇక శీకాకాయలో అధిక మోతాదులో విటమిన్ సి ఉంటుంది. ఇది చుండ్రును తగ్గిస్తుంది. శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. శిరోజాలకు కాంతిని అందిస్తుంది. దీంతో శిరోజాలు చిట్లిపోకుండా ఉంటాయి.
ఇలా మూడింటినీ కలిపి షాంపూను తయారు చేసుకుని వాడితే జుట్టు సమస్యలన్నింటి నుంచి బయట పడవచ్చు. మరి ఆ షాంపూను ఎలా తయారు చేయాలంటే..
కుంకుడు కాయలు, శీకాకాయలు, ఎండబెట్టిన ఉసిరికాయలు లేదా పొడిని తీసుకోవాలి. గుప్పెడు చొప్పున కుంకుడు కాయలు, 8 నుంచి 10 శీకాకాయలు, గుప్పెడు ఎండిన ఉసిరికాయలను తీసుకోవాలి. అన్నింటినీ రాత్రి నీటిలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మరిగించాలి. తరువాత చల్లార్చాలి. అనంతరం బ్లెండర్‌లో వేసి మిశ్రమంగా చేయాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టాలి. దీంతో వచ్చే చిక్కని ద్రవాన్ని షాంపూలా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడు తలకు రాయాలి. తరువాల గంట సేపు ఉండి తలస్నానం చేయాలి.
ఇలా వారంలో కనీసం 2 సార్లు చేసినా చాలు, జుట్టు సమస్యలన్నింటి నుంచి బయట పడవచ్చు. కుంకుడు కాయలు, శీకాకాయలు, ఉసిరికాయలు జుట్టు సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. పూర్వం మన పెద్దలు వీటి మిశ్రమాన్నే వాడేవారు. కానీ ఇప్పుడు మనం రసాయనాలు కలిసిన షాంపూలను వాడుతున్నాం. అందువల్లే జుట్టు సమస్యలు వస్తున్నాయి. కనుక వాటిని తొలగించుకోవాలంటే.. పైన తెలిపిన విధంగా వాటితో సహజసిద్ధమైన షాంపూను తయారు చేసుకుని వాడాల్సి ఉంటుంది. దీంతో కాంతివంతమైన, దృఢమైన శిరోజాలు మీ సొంతమవుతాయి.