పర్‌ఫ్యూమ్ వాసన చూడగానే తుమ్ములు వస్తున్నాయా ? గాలిలో దుమ్మ కణాలు ఉన్నప్పుడు ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు దిబ్బడ ఉంటున్నాయా ? అయితే మీరు అలర్జీతో బాధపడుతున్నట్లే లెక్క. నిజానికి ఈ సమస్యతో చాలా మంది చాలా కాలం నుంచి బాధపడుతుంటారు. దీనికి చికిత్స కోసం కూడా ప్రయత్నించి విఫలమవుతుంటారు. అయితే మన వంట ఇళ్లలోనే అలర్జీలను తగ్గించే సహజసిద్ధమైన పదార్థం ఒకటి ఉంది. అదే పసుపు. అవును, దీంతో అలర్జీలను తగ్గించుకోవచ్చు.
అలర్జీలు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. పలు ఆహార పదార్థాలను తినడం వల్ల, మందులు, కాలుష్యం, పుప్పొడి రేణువులు, పొగ వంటి కారణాల వల్ల అలర్జీలు వస్తుంటాయి. అలాగే కొన్ని రకాల వాసనలను చూడడం వల్ల కూడా అలర్జీలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే శరీరంలో హిస్టామైన్స్ ఉత్తేజం అవుతాయి. ఇవి మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి నీరు కారడం, జలుబు, చర్మంపై దురదలు రావడం, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
భారతీయులు పసుపుపు ఔషధ మూలికగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఇందులో కర్కుమినాయిడ్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇఇ శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. దీంతో అనేక అనారోగ్య సమస్యలను ఇవి నయం చేస్తాయి.
పసుపుతో అలర్జీలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక కప్పు గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ తేనె, చిటికెడు మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా రోజూ చేస్తే అలర్జీలు తగ్గుతాయి. అయితే పాలను తాగలేం అనుకునే వారు అందుకు బదులుగా బాదం పాలు లేదా కొబ్బరిపాలు, ఆవు పాలు తాగవచ్చు. వాటిల్లో పైన తెలిపిన పదార్థాలను కలుపుకుని తాగాలి. దీంతో అలర్జీలు తగ్గుతాయి.
2. ఒక గ్లాస్ వేడి నీటిలో అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ తేనెలను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల అలర్జీలు తగ్గుతాయి.
3. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ పసుపును కలిపి రాత్రి నిద్రించే ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా అలర్జీలను తగ్గించుకోవచ్చు.
పైన తెలిపిన మూడు విధానాల్లో ఏదో ఒక విధానాన్ని మాత్రమే రోజూ పాటించాలి. పసుపును అధికంగా తీసుకుంటే జీర్ణాశయంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. వికారం, తలతిరగడం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. గర్భిణీలు వైద్యుల సూచన మేరకు పైన తెలిపిన చిట్కాలను పాటించాలి. ఇక గాల్ బ్లాడర్, బ్లడ్ క్లాటింగ్ సమస్యలు ఉన్నవారు పైన తెలిపిన చిట్కాలను పాటించరాదు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365