తలపై ఉన్న వెంట్రుకల్లో చుండ్రు తరువాత అధిక శాతం మందికి ఇబ్బందికి కలిగించేవి పేలు. వాటితో జుట్టు కుదుళ్ల వద్ద దురదగా ఉండి ఎప్పుడూ నెత్తి గోక్కోవాల్సి వస్తుంటుంది. ఈ క్రమంలో పేల కారణంగా చుండ్రు సమస్య, పొట్టు రాలడం వంటివి కూడా ఎక్కువైపోతాయి. కేవలం పెద్దలకే కాదు చిన్నారులకు కూడా పేలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే వాటిని తొలగించుకునేందుకు మాత్రం అధిక శాతం మంది నానా తంటాలు పడుతున్నారు. కానీ కింద ఇచ్చిన కొన్ని సూచనలు పాటిస్తే పేల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బాదం లేదా ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని జుట్టును చిన్న చిన్న భాగాలుగా చేసి ఆ ఆయిల్‌ను అప్లై చేయాలి. అనంతరం వేడి నీటిలో దువ్వెన ముంచి దాంతో వెంట్రుకలను కుదుళ్ల నుంచి దువ్వాలి. అనంతరం షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే పేల సమస్య నుంచి బయట పడవచ్చు.
బాదం, ఆలివ్ ఆయిల్స్ లాగే నట్‌మెగ్, పెప్పర్‌మింట్, రెడ్ థైమ్, దాల్చిన చెక్క, యూకలిప్టస్, లవంగం, లావెండర్ ఆయిల్స్ కూడా పేల నుంచి విముక్తిని ఇస్తాయి. ఈ ఆయిల్స్‌లో దేన్నైనా 15 నుంచి 20 చుక్కల మోతాదులో తీసుకుని దానికి 60 ఎంఎల్ మోతాదులో ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా రాయాలి. దాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే తలను బాగా దువ్వి షాంపూతో తలస్నానం చేస్తే పేలు తొలగిపోతాయి. వాజెలిన్ లేదా కొబ్బరినూనెను కొద్దిగా తీసుకుని జుట్టుకు బాగా పట్టించాలి. అనంతరం తలకు షవర్ క్యాప్ చుట్టి 12 నుంచి 24 గంటల పాటు అలాగే ఉంచాలి. తరువాత షాంపూతో తలస్నానం చేసి మళ్లీ షవర్ క్యాప్‌ను 30 నిమిషాల పాటు చుట్టాలి. తరువాత తులసి ఆకు రసాన్ని తలకు పట్టించి దువ్వెనతో బాగా దువ్వాలి. మళ్లీ షాంపూతో తలస్నానం చేయాలి. చివరిగా ఒకసారి మళ్లీ షవర్ క్యాప్ పెట్టి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే మళ్లీ తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల పేలు పోతాయి.
2 సంవత్సరాల లోపు ఉన్న వారికైతే ఎలాంటి పదార్థాలను వాడకుండా సులభంగా పేలను తొలగించుకోవచ్చు. ఇందుకోసం పేల దువ్వెనను ఉపయోగించాలి. ఆ దువ్వెనతో బాగా దువ్వి షాంపూతో తలస్నానం చేయించాలి. స్నానం అనంతరం మళ్లీ దువ్వాలి. ఇలా 3 నుంచి 4 రోజులకు ఒకసారి చేస్తే చిన్నారుల తలల్లో పేలు పడవు. వేప నూనెలో యాంటీ ఇన్‌సెక్టిసైడ్ గుణాలు ఉన్నాయి. ఇవి పేలను పారదోలుతాయి. సాధారణంగా వాడే షాంపూలో కొద్దిగా వేప నూనెను కలిపి దాన్ని జుట్టుకు రాసి తలస్నానం చేస్తూ ఉంటే పేలు ఇట్టే పోతాయి. 8 నుంచి 10 వెల్లుల్లి రేకుల్ని తీసుకుని వాటిని ముద్దగా చేయాలి. ఆ మిశ్రమానికి 2-3 టీస్పూన్ల నిమ్మ రసం కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల పాటు ఆగాలి. తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చొప్పున చేసినా పేలు త్వరగా తగ్గిపోతాయి.
కొద్దిగా బేబీ ఆయిల్‌ను తీసుకుని జుట్టుకు పట్టించాలి. అనంతరం కొద్ది సేపు ఆగాక దువ్వెనతో జుట్టును బాగా దువ్వి గోరు వెచ్చని నీరు, షాంపూతో తలస్నానం చేయాలి. అలా చేశాక జుట్టుకు వైట్ వెనిగర్‌ను పట్టించి తలకు షవర్ క్యాప్‌ను ఉంచాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే మళ్లీ తలస్నానం చేస్తే పేలు పోతాయి. నువ్వుల నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌సెక్టిసైడల్ గుణాలు ఉన్నాయి. ఒక కప్పులో నాలుగో వంతు నువ్వుల నూనెలో కొంత వేప నూనె, యూకలిప్టస్ ఆయిల్, రోజ్‌మేరీ ఆయిల్, లావెండర్ ఆయిల్‌లను వేసి బాగా కలపాలి. ఈ ఆయిల్ మిక్చర్‌ను జుట్టుకు బాగా పట్టించాక, యాపిల్ సైడర్ వెనిగర్‌ను కొద్దిగా తీసుకుని దాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా అప్లై చేయాలి. అనంతరం తలకు ఒక షవర్ క్యాప్‌ను పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయాలి. దీని వల్ల పేలు త్వరగా తగ్గిపోతాయి.