వేసవి కాలంలో మనం ఏ ఆహార పదార్థాలను తినాలన్నా ఆలోచించి తినాలి. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలను వేసవిలో తినరాదు. తింటే విరేచనాలు అవుతాయి. వాటి వల్ల శరీరంలో వేడి అధికంగా వచ్చి విరేచనాలు కలుగుతాయి. దీనికి తోడు ఎండలో ఎక్కువగా తిరిగే వారు కూడా విరేచనాల బారిన పడాల్సి వస్తుంది. అయితే వర్షాకాలంలో ఏమో గానీ వేసవిలో విరేచనాలు అయితే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వేసవిలో విరేచనాల వల్ల ఒంట్లో ఉన్న నీరంతా బయటికి పోతుంది. తద్వారా డీ హైడ్రేషన్ సమస్య వచ్చి వడదెబ్బ తగిలేందుకు అవకాశం ఉంటుంది. కనుక విరేచనాలు అయితే వెంటనే తగిన సమయంలో స్పందించాలి. ఈ క్రమంలో మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే విరేచనాలను ఎలా కంట్రోల్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
నీళ్ల విరేచనాలు ఏర్పడినప్పుడు గడ్డ పెరుగును తినాలి. రోజులో కనీసం 2 నుంచి 3 కప్పుల పెరుగు తింటే నీళ్ల విరేచనాలు అదుపులోకి వస్తాయి. పెరుగులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ నీళ్ల విరేచనాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1-2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలపాలి. దాంట్లో కొంత తేనెను వేయాలి. అనంతరం ఆ ద్రవాన్ని బాగా కలిపి విరేచనాలు కట్టుకునేంత వరకు 2, 3 సార్లు తాగాలి. ప్రతి రెండు గంటలకు ఓసారి బాగా మగ్గిన అరటి పండును తింటున్నా లేదా అరటి పండు, పెరుగులను కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని రోజులో 2, 3 సార్లు తీసుకుంటున్నా నీళ్ల విరేచనాలు అదుపులోకి వస్తాయి. లేదంటే ఒక పచ్చి అరటి పండును నీటిలో మరిగించి అనంతరం దాన్ని బాగా నలిపి దాంట్లో కొంత నిమ్మరసం, ఉప్పు వేసి తిన్నా విరేచనాలు కట్టుకుంటాయి.
ఒకటిన్నర కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం మిశ్రమాన్ని వేసి ఆ నీటిని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి తాగుతుంటే విరేచనాలు తగ్గిపోతాయి. లేదంటే ఎండిన అల్లం పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి కొద్దిగా, దాల్చిన చెక్క పొడి, తేనెలను కొంత మొత్తంలో తీసుకుని అన్నింటినీ బాగా కలిపి తింటున్నా విరేచనాలు కట్టుకుంటాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ పసుపును వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తాగుతుంటే ఫలితం ఉంటుంది. లేదంటే 1 టేబుల్ స్పూన్ పెరుగులో 1 టీస్పూన్ పసుపును వేసి తింటున్నా విరేచనాలను తగ్గించుకోవచ్చు.
ఒక పాత్రలో నీటిని తీసుకుని దాంట్లో తురిమిన అల్లం అర టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్ మోతాదులో వేసి ఆ నీటిని 30 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని నిత్యం 2, 3 సార్లు తాగితే విరేచనాలు పోతాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ తేనె, అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిలను వేసి బాగా కలిపి తాగాలి. దీంతో కూడా విరేచనాలు తగ్గిపోతాయి. అరటి పండు, పెరుగులలో దాల్చిన చెక్క పొడిని కొద్దిగా చల్లి వాటిని తింటున్నా విరేచనాలు కట్టుకుంటాయి. దానిమ్మ పండు రసం కూడా నీళ్ల విరేచనాలను ఆపుతుంది.