Oil For Hair Growth : ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు ఎక్కువగా రాలడం వల్ల జుట్టు పలుచగా మారుతుంది. క్రమంగా ఇది బట్టతలకు దారి తీస్తుంది. జుట్టుకు కావల్సిన పోషకాలు సరిగ్గా అందని కారణంగా జుట్టు బలహీనంగా మారి ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్ని రకాల నూనెలను వాడుతూ ఉంటారు. అయినప్పటికి ఎటువంటి ఫలితం లేక నిరుత్సాహపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుందనే చెప్పవచ్చు.
ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ నూనెను వాడడం వల్ల జుట్టుకు కావల్సిన పోషకాలన్నీ అంది జుట్టు బలంగా, ధృడంగా మారుతుంది. ఈ నూనెను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. అలాగే దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక. జుట్టు రాలడాన్ని తగ్గించే ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను తయారు చేయడానికి మనం ముఖ్యంగా ఉపయోగించాల్సింది వేపాకు. వేపాకులో మన జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడతాయి. అలాగే వేపాకును ఉపయోగించడం వల్ల చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
ముందుగా వేపాకును శుభ్రంగా కడిగి నీడలో రెండు గంటల పాటు ఆరబెట్టాలి. తరువాత ఈ ఆకులను జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో అర కప్పు కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఈ నూనెను డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో వేడి చేయాలి. ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో కొబ్బరి నూనె గిన్నెను ఉంచి వేడి చేయాలి. కొబ్బరి నూనె వేడయ్యాక ఇందులో ముందుగా తయారు చేసుకున్న వేపాకు పేస్ట్ ను రెండు టీ స్పూన్ల మోతాదులో వేసి కలపాలి. వేపాకు గుణాలన్నీ నూనెలో కలిసి నూనె డార్క్ గ్రీన్ కలర్ అయ్యే వరకు వేడి చేయాలి. ఇలా వేడిన తరువాత ఈ నూనెను వడకట్టి మరో గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను సాయంత్రం లేదా రాత్రి పడుకునే ముందు ముని వేళ్లతో జుట్టు కుదుళ్లకు పట్టించి సున్నితంగా మర్దనా చేసుకోవాలి.
దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో లేదా సాధారణ నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారినికి ఒకసారి చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు నల్లగా కూడా ఉంటుంది. జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ విధంగా వేపాకుతో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.