Kakarakaya Patoli : మనం కాకరకాయలను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటాము. ఇతర కూరగాయల వలె కాకర కాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేదుగా ఉంటాయని చాలా మంది కాకరకాయలను తినరు. కానీ వీటిని కూడా మనం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. కాకరకాయలను తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. కాకరకాయలతో మనం వివిధ రకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. కాకరకాయలతో చేసుకోదగిన రుచికరమైన కూరల్లో కాకరకాయ పాటోలి కూడా ఒకటి. శనగపిండి వేసి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండేలా కాకరకాయ పాటోలిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ పాటోలి తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన కాకరకాయలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, శనగపిండి – 5 టీ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
కాకరకాయ పాటోలి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా నీళ్లు పిండిని చిక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత వాటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయ ముక్కలను వేయించాలి. కాకరకాయ ముక్కలు సగానికి పైగా వేగిన తరువాత మూత పెట్టకుండా వేయించాలి. కాకరకాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న శనగపిండిని వేసుకోవాలి. దీనిని కదపకుండా మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించాలి. ఇలా మగ్గించిన తరువాత గంటెతో ముక్కలను విడగొడుతూ అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత ఈ ముక్కలను కరకరలాడే వరకు వేయించుకోవాలి. తరువాత కారం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత మరో కళాయిలో నూనె వేసి వేయించాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ముందుగా వేయించిన కాకరకాయలను వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పాటోలి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. కాకరకాయతో ఈ విధంగా తయారు చేసిన పాటోలిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.