చలికాలంలో సహజంగానే చాలా మంది గురక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే గురక వల్ల ఈ సమస్య ఉన్నవారికే కాకుండా పక్కన పడుకునే వారికి కూడా ఇబ్బందిగా ఉంఉటంది. అయితే చలికాలంలో అసలు గురక ఎందుకు వస్తుంది.. దీన్ని ఎలా నివారించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో గురక అనేది ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం వల్ల వస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఫలితంగా మనకు తెలియకుండానే నోటితో రాత్రిపూట శ్వాస తీసుకుంటాం. దీంతో గురక వస్తుంది. అలాగే చలికి గొంతులో ఉండే నాళాలు మూసుకుపోయినట్లు మారుతాయి. దీంతో శ్వాస ఆడడం కష్టంగా ఉంటుంది. ఫలితంగా గురక వస్తుంది. గురక వచ్చేందుకు ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
చలికాలంలో సహజంగానే చాలా మంది వ్యాయామం చేసేందుకు బద్దకంగా ఉంటారు. శారీరక శ్రమ కూడా పెద్దగా ఉండదు. దీని వల్ల ఈ సీజన్‌లో బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా జరిగితే గొంతు చుట్టూ కూడా కొవ్వు పేరుకుపోతుంది. ఇది గురకకు కారణమవుతుంది. అలాగే చలికాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. దీంతో గొంతు, ముక్కు రంధ్రాలు త్వరగా పొడిగా మారుతాయి. ఫలితంగా ఇది గురకకు దారి తీస్తుంది. ఇక గురకను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యూకలిప్టస్ ఆయిల్‌ను వేడి నీటిలో కలిపి అనంతరం వచ్చే ఆవిరిని వాసన పీలుస్తుండాలి. రాత్రి నిద్రకు ముందు ఇలా చేస్తుంటే తప్పక ఫలితం ఉంటుంది. అలాగే చాలా మందికి వెల్లకిలా పడుకుంటేనే గురక వస్తుంది. అలాంటప్పుడు నిద్రించే భంగిమను మార్చాలి. ఏదైనా ఒక పక్కకు తిరిగి పడుకోవడం వల్ల గురక రాకుండా నియంత్రించవచ్చు. అలాగే ఇంట్లో హ్యుమిడిఫైర్‌లను ఉపయోగించాలి. ఇవి గదిలో తేమ వాతావరణాన్ని ఉంచుతాయి. దీంతో గొంతు, ముక్కు రంధ్రాలు పొడిగా మారకుండా చూసుకోవచ్చు. దీని వల్ల గొంతు, ముక్కులో తేమ ఉంటుంది. ఫలితంగా గురక రాకుండా నియంత్రించవచ్చు.
అధిక బరువు కారణంగానే గురక వస్తుంది కనుక బరువు ఎక్కువగా ఉన్నవారు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీంతో ఆటోమేటిగ్గా గురక దానంతట అదే తగ్గుతుంది. అలాగే మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. ఈ రెండు కూడా గురకకు కారణమవుతాయి. కనుక ఈ అలవాట్లను మానేయాల్సి ఉంటుంది. అలాగే రాత్రి నిద్రకు ముందు ఏదైనా హెర్బల్ టీని సేవించాలి. ఇలా చేయడం వల్ల కూడా గురక సమస్య నుంచి బయట పడవచ్చు.