Diabetes : ప్రస్తుత తరుణంలో చాలా మంది షుగర్ వ్యాధితో బాధడుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరిలో ఎన్ని రకాల మందులు వాడినా షుగర్ వ్యాధి నియంత్రణలోకి రావడం లేదు. అంతే కాకుండా ఈ మందులను వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాల బారిన కూడా పడుతున్నారు. ఈ మందుల ద్వారా మాత్రమే కాకుండా సహజ సిద్దమైన పద్దతిలో కూడా ఈ వ్యాధిని నియంత్రించుకోవచ్చు. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో మెంతులు ఎంతో సహాయపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మెంతులను పొడిగా చేసుకుని ఉదయం, సాయంత్రం 5 గ్రా.(ఒక టీ స్పూన్) ల చొప్పున తీసుకుంటే షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. షుగర్ వ్యాధిని నియంత్రించడానికి మన ఆహారపు అలవాట్లలలో కూడా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూరలల్లో ఉప్పు, నూనె వాడకాన్ని తగ్గించాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించడం వల్ల కూడా షుగర్ వ్యాధి కొంత నియంత్రణలోకి వస్తుంది. ఉప్పు వాడకాన్ని కొంత మంది ఎంత ప్రయత్నించినా తగ్గించలేరు. అలాంటి వారు భోజనంలో భాగంగా మెంతి పొడిని తీసుకోవడం వల్ల ఈ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. మెంతులను కొద్దిగా వేయించి తరువాత జార్ లో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజూ భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో 5 గ్రా. ల మెంతి పొడిని వేసుకుని తినాలి. మెంతులు చేదుగా ఉంటాయి కనుక కొద్దిగా నెయ్యిని వేసుకుని తినవచ్చు.
మొదటి ముద్దలో తినలేని వారు చివరి ముద్దలో కూడా మెంతి పొడిని వేసుకుని తినవచ్చు. బియ్యంతో వండిన అన్నం కంటే పుల్కాలు, జొన్న సంగటి, రాగి సంగటి వంటి చిరు ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల షుగర్ వ్యాధి త్వరగా నియంత్రణలోకి వస్తుంది. రాత్రి భోజనంలో చపాతీ, పుల్కాలను తినే వారు భోజనం చివరిలో కూరలో మెంతి పొడిని వేసుకుని తినవచ్చు లేదా మజ్జిగ, పెరుగులో కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా మెంతి పొడిని వాడితే షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది.
కనుక వైద్యుడి పర్యవేక్షణలో షుగర్ వ్యాధి కోసం వాడే మందులను మనం తగ్గించవచ్చు. మరి కొంత మంది షుగర్ వ్యాధిని నియంత్రించడానికి సాయంత్రం భోజనంలో కేవలం పండ్లను, డ్రై ఫ్రూట్స్‌ను మాత్రమే తింటూ ఉంటారు. అలాంటి వారు పండ్ల ముక్కలపై మెంతి పొడిని వేసుకుని తినవచ్చు. ఇలా చేయడం వల్ల మందుల వాడకం తగ్గి దుష్ప్రభావాలు తగ్గుతాయి. ఆహార నియమాలను పాటించడంతోపాటు మెంతులను ఇలా వాడడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.