క్షార పదార్థాలవల్ల అగ్ని ప్రమాదాలు జరిగితే వెన్న నిమ్మరసం, పాలు వంటివి గాయాలకు పూయాలి. ఖరీదైన గాజుసామాగ్రి శుభ్రం చేస్తున్నప్పుడు చేతిలో నుంచి జారి పగిలిపోకుండా ఉండకుండా వాటిని తుండుగుడ్డలో చుట్టి శుభ్రం చేయాలి. గంధపు చెక్కను పుస్తకాల మధ్య ఉంచితే పుస్తకాలు తినేసే పురుగులు, చిమటలు ఆదరికిరావు. గచ్చు నేల కడిగేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపితే, ఆరిన తరువాత ఈగలు వాలవు. గాజు సామాగ్రిపై పడిన గీతలు టూత్‌పేస్ట్ తో రుద్దితే సరి. గులాబీ పువ్వుల రేకులు ఊడి పోకుండా ఉండాలంటే పూలు తేగానే ప్రతీ పువ్వు మధ్యన ఒక చుక్క కొబ్బరి నూనె వేయాలి. చింతపండుతో పాటు కొంచెం ఉప్పు కూడా కలిపి రాగి పాత్రలను తోమినట్లైతే తళ తళా మెరుస్తాయి.
చేతికి రానంత చిన్నవై పోయిన టాయిలెట్ సోపు ముక్కలు ఎండ బెట్టి తురిమి సర్ఫ్ వంటి పౌడర్‌లలో కలిపి బట్టలు ఉతికితే కమ్మని సువాసనను అందిస్తాయి. చెప్పులు, బూట్లు కరుస్తూ ఉంటే ఆ భాగానికి పెరుగుపూసి ఒక రాత్రంతా ఉంచండి. తెల్లవారి ఎండిన పెరుగు దులిపి పాదరక్షలు ధరించండి. జార్ లేదా బాటిల్ మూత తీయడం కష్టంగా ఉందా? వేడి నీటి పంపు క్రింద కొంచెం సేపు ఉంచండి చాలు. జలుబు నుంచి ఉపశమనం వదలాలంటే గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకొని రాత్రిళ్ళు తాగాలి. నల్లుల మందులు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి విషం కనుక గదిలో నల్లుల మందు కొడితే, కొట్టిన నాలుగు గంటల తరువాతనే పిల్లల్ని ఆ గదిలోనికి పోనివ్వాలి.
టర్పెన్ టైన్ ఆయిల్ లో తడిపిన పత్తిని ఇంటి మూలల్లో, బీరువాల కిందా ఉంచితే ఎలుకలు రావు. డర్టీగా, మాసిపోయిన ఎలక్ట్రిక్ స్విచ్చులను కిరోసిన్లో ముంచిన కాటన్ తో తుడవండి. తుప్పుపట్టిన తాళాన్ని కిరోసిన్‌లో ముంచిన బట్టతో తుడిస్తే కొత్తదానిలా తయారవుతుంది. తుప్పుపట్టిన స్క్రూలకు కాస్త వెనిగర్ రాయండి. కొద్దిసేపటితర్వాత సులువుగా ఊడదీయవచ్చు. తులసి మొక్కను పురుగు తినకుండా ఉండాలంటే మొక్కల అడుగున ఒక ఉల్లి గడ్డను పాతి ఉంచాలి. దంత సామాగ్రి బొమ్మల వంటివి పసుపు రంగులోకి మారితే నిమ్మ తొక్కలతో రుద్దాలి. నిమ్మనూనెలో రెండుచుక్కలు వేపనూనె వేసి రాత్రిపూట దీపం వెలిగిస్తే చక్కటి సువాసన ఇల్లంతా పరచుకోవడమే కాక దోమలూ రావు. నిలువ చేసిన బియ్యంలో పురుగులు చేరకుండా ఉండాలంటే ఎండిన కాకరకాయను పలచని వస్త్రంలో కట్టి ఆ డబ్బాలో వేస్తే సరి. పాత గిఫ్ట్ పేపర్లను నోట్‌బుక్‌లకు అట్టలు వేసేందుకు వాడుకోవచ్చు.