తుప్పుపట్టిన తీగలపై బట్టలు ఆరేసినప్పుడు లేదా బట్టలకు ఉన్న హుక్స్ తుప్పు పడితే, బట్టలకు తుప్పు మరకలు అవుతాయి. ఆ తుప్పు మరకలు పోవాలంటే మరకల మీద నిమ్మ తొక్కలతో గానీ ఉప్పు కలిపిన నిమ్మరసంతో గానీ రుద్ది ఎండలో వేయాలి. తెల్లటి నూలు వస్త్రాలపై తుప్పుమరకలు పడితే వాటిమీద నిమ్మరసం, ఉప్పు రాసి రెండు గంటలు ఎండలో ఉంచి ఆ తర్వాత ఉతకాలి. తెల్లని బట్టమీద కూర మరకలు పడితే ఆ మరక మీద తెల్లని టూత్ పేస్టు కొంచెం రాసి నీటిలోఉంచి తడిపి ఉతికి ఆరేస్తే మరక పోతుంది. తెల్లని బట్టలపైన పడిన మరకలను నిమ్మరసం వేసి నిమ్మ తొక్కతో రుద్ది తర్వాత సబ్బుతో ఉతికితే మచ్చలు మాయమవుతాయి.
దుప్పటి చివర్లు చినుగుతున్నట్లయితే కొత్త శాటిన్ బట్టను కొని దుప్పటి నాలుగు అంచులకు బోర్డర్‌లా వేసి కుడితే అది మళ్ళీ కొత్తదానిలా తయారవుతుంది. నారింజ తొక్కలు ఎండ పెట్టి బట్టల మధ్య ఉంచితే బట్టల్ని పురుగులు కొట్టి వేయవు. నిమ్మతొక్కలతో రుద్దితే బట్టలమీద పడిన గోరింటాకు మరకలు పోతాయి.
పసుపు మరకలైన గుడ్డలకు సబ్బు రాస్తే ఎరుపు అవుతుంది. కనుక ఉతకటానికి ముందు ఎండలో ఆరవేస్తే పసుపు మరకలు పోతాయి. పేరుకున్న మురికిని వదిలించడానికి గట్టిగా బ్రష్‌తో రుద్దితే షర్టుకాలర్లు త్వరగా పాడవుతాయి. కాస్త షాంపువేసి నాననిచ్చి ఉతికి చూడండి మంచిగా వుంటాయి. బట్ట మీద ఇస్త్రీ పెట్టి చిలుం మరక అయినట్లయితే ఆ మరకను ఉప్పు పొడిలో రుద్ది, కొంత సేపు తరువాత ఉతికినట్లయితే చిలుం మరకపోతుంది.