పుచ్చకాయ.. గతంలో కేవలం వేసవి కాలంలో మాత్రమే దొరికేది. కానీ ఇప్పుడు ఏ కాలంలోనైనా దొరుకుతున్నాయి. వేసవి కాలంలో పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది. వేసవిలో లభించే పుచ్చకాయల రుచి, నాణ్యత వేరుగా ఉంటుంది. వేసవిలో కలిగే వేడి తాపం నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. ఈ రోజుల్లో పుచ్చకాయలు రకరకాలుగా దొరుకుతున్నాయి.
పుచ్చకాయ కొనుక్కుని రెండు రోజుల తర్వాత తిందాం అంటే కుదరదు. పుచ్చకాయ లోపల ఎర్రగా ఉందో లేదో చూద్దామని కోస్తే త్వరగా తినెయ్యాలి, లేదా కుళ్లిపోతుంది. అయితే పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడానికి చాలా చిట్కాలు ఉన్నాయి. పుచ్చకాయ బరువు రెండు కేజీల కన్నా ఎక్కువ ఉండాలి. పుచ్చకాయ ఏ రంగులో ఉన్నా ఫరవాలేదు. అలాగే చారలు ఉన్నా లేకపోయినా ఫరవాలేదు. పుచ్చకాయ తొడిమ ఎండి ఉండాలి. పుచ్చకాయ గట్టిగా, బరువుగా ఉండాలి. మెత్తగా, బరువు లేకుండా ఉంటే పుచ్చకాయ లోపల పాడైనట్టే. కొన్ని పుచ్చకాయలపై చారలు లేకుండా ఉంటాయి. లేదా కొన్ని పుచ్చకాయలపై గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. పుచ్చకాయలు దాదాపుగా గుండ్రంగానే ఉంటాయి.
మచ్చలు ఎన్ని ఎక్కువ ఉంటే పుచ్చకాయ లోపల అంత ఎర్రగా ఉన్నట్టు. కొన్ని పుచ్చకాయలకు ఒకటే మచ్చ ఉంటుంది. కొన్నింటికి రెండు మూడు మచ్చలు కూడా ఉంటాయి. పుచ్చకాయ ఎంత ఎర్రగా ఉంటే అందులో పోషకాలు అంత ఎక్కువగా ఉంటాయి. అందుకే బరువుగా ఉండి, మచ్చలు ఎక్కువగా, తొడిమ ప్రాంతం ఎండిన పుచ్చకాయను ఎంచుకోండి. అప్పుడు పుచ్చకాయ లోపల ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడానికి కొయ్యనవసరం ఉండదు. కట్ చెయ్యని పుచ్చకాయను ఇంట్లో ఫ్రిజ్ లోగాని లేదా ఎండ తగలని ప్లేస్ లో పెట్టడం వల్ల రెండు రోజులైనా పాడవకుండా ఉంటుంది. పుచ్చకాయలో బి-విటమిన్ లు, పొటాషియం, ఎలక్ట్రోరైట్లు ఎక్కువగా ఉంటాయి.
బి విటమిన్లు శరీరానికి శక్తిని ఇస్తే, పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారిన పడి శరీరం నిస్తేజం కాకుండా పుచ్చకాయ కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి పుచ్చకాయ గుజ్జును రాస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. వంద గ్రాముల పుచ్చకాయ ముక్కల నుంచి 30 కేలరీలు మాత్రమే అందుతాయి. బీపీ ఉన్నవాళ్లు పుచ్చకాయ తింటే చాలా మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం లు రక్త పోటును అదుపు చేస్తాయి. పుచ్చకాయలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ బి, సి లతో పాటు శరీర పని తీరుకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఐయోడిన్ లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పుచ్చకాయను తింటే శరీరంలోని వేడి తగ్గడమే కాకుండా.. మనకు పోషకాలు లభిస్తాయి. కనుక ఇకపై పుచ్చకాయలను కొంటే పైన తెలిపిన విధంగా సూచనలు పాటించండి. దీంతో రుచికరమైన పుచ్చకాయలను కొనవచ్చు.