స్వెటర్లు భద్రపరిచే ముందు వాటి మధ్యలో ఓ వేపపుల్ల పెట్టండి. పురుగులు చేరవు. పూరీలు, పకోడీలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే వేయించేటప్పుడు నూనెలో అరటీ స్పూన్ ఉప్పు వేయాలి. పుట్టగొడుగులను ఎప్పుడు అల్యూమినియం పాత్రలలో ఉడకబెట్టకూడదు. అలా చేస్తే అవి నల్లగా మారిపోతాయి. చిక్కుడు, పచ్చి బఠాణీ, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు వాటిలో ఒక టీ స్పూన్ షుగర్ కలిపితే వాటి సహజమైన రంగుని కోల్పోవు. పచ్చిమిరపకాయల్ని ఎక్కువగా తరిగినప్పుడు చేతివేళ్ళు మంటగా అనిపిస్తే వాటిని చల్లని పాలలో కొద్దిసేపు ఉంచితే మంట తగ్గుతుంది. పాలలో కొంచెం చక్కెర కూడా కలపవచ్చు. ఇడ్లి, దోసెల కోసం బియ్యం, మినప్పప్పు నానబెట్టేటప్పుడు ముందే కడగాలి. నానిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు కడగటం వల్ల విటమిన్లు నీటి లో పోతాయి. అంతే కాకుడా దుకాణాల లో వాటికి పురుగు పట్టకుండా నిల్వ చేయడానికి కీటకనాశినులను గనుక వాడి ఉంటే కడగకుండా నానబెట్టినప్పుడు ఆ అవశేషాలతో కూడిన నీటినే బియ్యం, మినప్పప్పు పీల్చుకుంటాయి. కాబట్టి అవన్నీ శరీరం లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది.
కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు అందులో బంగాళదుంప ముక్కలను వేయాలి. అదికంగా ఉన్న ఉప్పును పొటాటో పది నిమిషాల లో పీల్చుకుంటుంది. గారెల కోసం తయారు చేసుకున్న పిండిలో నీరు ఎక్కువై నూనెలో వేయగానే అంచులదగ్గర సన్న పలుకులుగా విడిపోతున్నట్లయితే, పిండిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి కలపాలి. కూరలు, పులుసులు, సూప్ లు మరీ పలుచగా ఉన్నట్లనిపిస్తే అందులో ఒక టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ కలపాలి. కార్న్ ఫ్లోర్ ను అలాగే వేస్తే ఉండలవుతుంది. ముందుగా ఒక కప్పులో వేసి చన్నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని కూరల్లో వేస్తే సమంగా కలుస్తుంది. ఉదయాన్నే అల్పాహారంగా ఓట్ మీల్ తీసుకుంటుంటే కొన్ని రోజుల్లోనే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.
బుక్షెల్ఫ్స్ లో చిన్న చిన్న పురుగులు చేరుతుంటాయి. వాటినలాగే వదిలేస్తే పుస్తకాలను తినేస్తాయి. అరల్లో అక్కడక్కడా చిన్న చందనం బిళ్ళలు వేస్తే పురుగులు పట్టవు. గ్లూ స్టిక్స్ ఎండిపోయినట్లయితే అందులో కొద్దిగా గ్లిజరిన్ వేసి గోరువెచ్చగా చేయాలి. గ్లూ మెత్తబడి వాడుకోవడానికి వీలుగా మారుతుంది. తెల్లటి షూ మీద ఏమైనా మరకలు పడి ఉతికినా పోకపోతే, దూదిని నెయిల్ పాలిష్ రిమూవర్లో ముంచి రుద్దాలి. షూ మీద పడిన మరకలు వదలకపోతే ఆఫ్టెర్ షేవ్ లోషన్తో తుడిస్తే ఫలితం ఉంటుంది. మిక్సీలో మసాలాలు గ్రైండ్ చేసిన తర్వాత కడిగినా కూడా మసాలా వాసన వదలదు. అలాంటప్పుడు ఎండిపోయిన బ్రెడ్ ముక్కలను వేసి ఒకసారి తిప్పితే చాలు. మెత్తటి క్లాత్‌ను వేడినీటిలో ముంచి అద్దాన్ని తుడిస్తే చక్కగా శుభ్రపడుతుంది. తడి అద్దం అంచుల నుంచి లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
అమ్మోనియా, వెనిగర్ వంటి వాటిని నీటిలో కలిపి ఆ మిశ్రమంలో ముంచి పిండివేసిన క్లాత్‌తో తుడవవచ్చు. అద్దాన్ని శుభ్రం చేయడానికి క్లీనింగ్ ఎలిమెంట్స్ వాడేటప్పుడు వాటిని నేరుగా అద్దం మీద స్ప్రే చేయకూడదు. మెత్తటి క్లాత్ తీసుకుని దాని మీద స్ప్రే చేసి తుడవాలి. తుడవడానికి వాడే క్లాత్‌కు ఎటువంటి గట్టి వస్తువులు లేకుండా చూసుకోవాలి. పాత కాటన్ షర్టు లేదా బనియన్‌లు వాడుతుంటారు. వాటికి బటన్లు ఉంటే ముందుగానే తీసేయాలి. ఇడ్లి, దోసెల పిండి పులిసి పోకుండా ఫ్రెష్‌గా ఉండాలంటే పిండిలో తమలపాకు వేసి ఉంచాలి.