information

Post Office Saving Schemes : పోస్టాఫీస్‌లో డ‌బ్బును పొదుపు చేయాల‌నుకుంటున్నారా..? అయితే ఏ ప‌థ‌కంలో ఎంత డ‌బ్బు వ‌స్తుందో తెలుసా..?

Post Office Saving Schemes : మ‌న‌కు డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ కూడా ఒక‌టి. పోస్టాఫీస్‌ల‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వ‌హిస్తుంది. క‌నుక మనం అందులో పొదుపు చేసుకునే డ‌బ్బుకు పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ఉంటుంది. అలాగే మ‌నం పెట్టిన డ‌బ్బుకు కచ్చిత‌మైన ఆదాయం కూడా వ‌స్తుంది. అందుక‌నే చాలా మంది బ్యాంకుల‌తోపాటు పోస్టాఫీస్‌లోనూ ప‌లు ప‌థ‌కాల్లో డ‌బ్బును పొదుపు చేసుకుంటూ ఉంటారు. ఇక పోస్టాఫీసులు మ‌న‌కు అనేక ర‌కాల ప‌థ‌కాల‌ను అందిస్తున్నాయి. ఇక ఏ ప‌థ‌కంలో మ‌నం డ‌బ్బును పొదుపు చేస్తే ఎందులో మ‌న‌కు ఎక్కువ రిట‌ర్న్స్ వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీస్‌లో మ‌నం సాధార‌ణ సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేసి డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు. కానీ దీనికి ఏడాదికి 4 శాతం మాత్ర‌మే వ‌డ్డీని చెల్లిస్తారు. ఈ బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేస్తే ఏటీఎం కూడా పొంద‌వ‌చ్చు. డ‌బ్బును విత్‌డ్రా కూడా చేసుకోవ‌చ్చు. ఇక పోస్టాఫీస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఏడాది పాటు డ‌బ్బును పొదుపు చేస్తే 6.9 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. అంటే రూ.10వేలను ఏడాది పెడితే రూ.708 వ‌డ్డీ వ‌స్తుంద‌న్న‌మాట‌.

different types of post office schemes and their interest rates

వ‌డ్డీల వివ‌రాలు..

ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను 2 ఏళ్ల పాటు పెడితే 7 శాతం వ‌డ్డీ వ‌స్తుంది. అంటే ఏడాదికి రూ.719 వ‌డ్డీ చెల్లిస్తారు. 3 ఏళ్ల పాటు అయితే 7.1 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. ఇక 5 ఏళ్ల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఏకంగా 7.5 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. దీంతో రూ.10 వేలు పెడితే ఏడాదికి రూ.771 వ‌డ్డీని పొంద‌వ‌చ్చు. ఇక పోస్టాఫీస్‌లో రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్‌లో డ‌బ్బును పొదుపు చేస్తే 6.7 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. అయితే పోస్టాఫీస్ ఎఫ్‌డీ, ఆర్‌డీ స్కీమ్‌ల‌లో వ‌డ్డీని 3 నెల‌ల‌కు ఒక‌సారి చెల్లిస్తారు. ఇక సీనియ‌ర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ కింద డ‌బ్బును పొదుపు చేస్తే ఏడాదికి 8.2 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. అంటే రూ.10వేలు పొదుపు చేస్తే నెల‌కు రూ.205 వ‌డ్డీ పొంద‌వ‌చ్చు. 3 నెల‌ల‌కు ఒక‌సారి వ‌డ్డీని చెల్లిస్తారు.

మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ కింద డ‌బ్బును పోస్టాఫీస్‌లో పొదుపు చేస్తే 7.4 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. రూ.10వేలు ఇందులో పెడితే నెల‌కు రూ.62 వ‌డ్డీ పొంద‌వ‌చ్చు. నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్ కింద డ‌బ్బును పొదుపు చేస్తే 7.7 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. రూ.10వేలు పెడితే మెచూరిటీ విలువ రూ.14,490 అవుతుంది. ఏడాదికి ఒక‌సారి వ‌డ్డీ చెల్లిస్తారు. ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) స్కీమ్‌లో 7.1 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. ఏడాదికి ఒక‌సారి వ‌డ్డీని క‌లుపుతారు. కిసాన్ వికాస్ ప‌త్ర అయితే 7.5 శాతం వ‌డ్డీ వ‌స్తుంది. ఏడాదికి ఒక‌సారి చెల్లిస్తారు. ఈ ప‌థ‌కం 115 నెల‌ల త‌రువాత మెచూర్ అవుతుంది.

మ‌హిళ‌ల‌కు అయితే..

మ‌హిళా స‌మ్మాన్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్ స్కీమ్‌లో డ‌బ్బును మ‌హిళ‌లు పొదుపు చేస్తే 7.5 శాతం వ‌డ్డీ పొంద‌వ‌చ్చు. దీనికి 3 నెల‌ల‌కు ఒక‌సారి వ‌డ్డీ చెల్లిస్తారు. రూ.10వేలు పెడితే మెచూరిటీ వ్యాల్యూ 11,602 అవుతుంది. ఆడ‌పిల్ల పేరిట తల్లిదండ్రులు సుక‌న్య స‌మృద్ధి స్కీమ్‌లో డ‌బ్బును పొదుపు చేస్తే 8.2 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. దీనికి ఏడాదికి ఒకసారి వ‌డ్డీ చెల్లిస్తారు. ఇలా ప‌లు ర‌కాల స్కీమ్‌లు పోస్టాఫీస్‌ల‌లో అందుబాటులో ఉన్నాయి. క‌నుక మీకు స‌మీపంలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి మీకు న‌చ్చిన స్కీమ్‌లో చేరి డ‌బ్బును పొదుపు చేసుకోవ‌చ్చు. దీంతో మీకు క‌చ్చితమైన రిట‌ర్న్స్ వ‌స్తాయి. అలాగే మీ డ‌బ్బుకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కూడా ఉంటుంది.

Admin

Recent Posts