సొంతిల్లు కట్టుకోవడమనేది సామాన్య ప్రజల కల. అయితే దాన్ని నెరవేర్చుకోవడం అంటే అది అంత సాధారణ విషయం కాదు. ప్రభుత్వాలు ఇచ్చే ఇండ్ల పథకాల్లో ఇల్లు వస్తే ఓకే. లేదంటే సంపాదన సామర్థ్యం ఉన్న వారు ఇంటి రుణం తీసుకుని ఇల్లు కట్టుకోవాల్సిందే. ఈ క్రమంలో ఇంటి రుణాలు తీసుకునే విషయంలో ఎవరైనా జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే వడ్డీ కావచ్చు, ఇతరత్రా చెల్లింపులు కావచ్చు, అసలు రుణం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బే మీరు బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎవరైనా ఇంటి రుణం తీసుకునే ముందు కచ్చితంగా పరిశీలించాల్సిన అంశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వడ్డీ రేటు…
ఇంటి రుణాలను అందించే బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు ఏవైనా వడ్డీ రేట్లను రెండు రకాలుగా మనకు అందిస్తాయి. అందులో ఒకటి ఫిక్స్‌డ్ అంటే స్థిర వడ్డీ రేటు. ఇది మనకు రుణం ఇచ్చే సమయంలో ఒకేసారి చెబుతారు. దాని ప్రకారమే మనం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంకొకటి చర వడ్డీ రేటు. అంటే ఇంటి రుణం ఇచ్చాక సదరు సంస్థ లేదా బ్యాంక్ వారు మన రుణానికి చెందిన వడ్డీ రేటును సంవత్సరానికి ఓసారి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుస్తుంటారు. ఇది గతంలో కన్నా ఎక్కువ లేదా తక్కువ కూడా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఇంటి రుణం తీసుకునే వారు ఎలాంటి వడ్డీ అయితే మంచిదో బాగా ఆలోచించి సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. లేదంటే అసలు కాకుండా వడ్డీయే ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. అయితే ఏ వడ్డీ ప్రకారం తీసుకోవాలో నిర్ణయించుకోలేని వారు ఈ సూచన పాటిస్తే మంచిది. అదేమింటటే… వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు చర వడ్డీని, వడ్డీ రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఫిక్స్‌డ్ వడ్డీని ఎంచుకోవాలి.
2. వివిధ రకాల రుసుములు…
ఇంటి రుణాలు తీసుకునేటప్పుడు ఫైనాన్స్ సంస్థలు రక రకాల రుసుములు వేస్తుంటాయి. వాటిలో ప్రాసెసింగ్ ఫీ అని, మెయింటెనెన్స్ ఫీ అని, లేట్ పేమెంట్ ఫీ అని, ప్రీ క్లోజర్ ఫీ అని చాలా ఉంటాయి. కనుక వీటన్నింటినీ వీలైనంత వరకు తక్కువగా వేసే ఫైనాన్స్ సంస్థల నుంచి రుణం తీసుకోవడం మంచిది. దీంతో మనం కట్టే మొత్తం భారీగా ఉండకుండా జాగ్రత్త పడవచ్చు.
3. లోన్ ఈఎంఐ…
చాలా వరకు ఇంటి రుణాలను ఇచ్చే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు దీర్ఘ కాలిక ఈఎంఐలు తీసుకోవాలని మనకు సూచిస్తాయి. దీంతో మనం కట్టే ఈఎంఐ తగ్గుతుందని ఆశ చూపెడతాయి. అయితే ఇందులో ఉన్న లొసుగు ఏమిటంటే… అలా లోన్ కాల పరిమితి దీర్ఘకాలికంగా ఉంచితే అప్పుడు మనం కట్టే అసలు కన్నా వడ్డీయే ఎక్కువవుతుంది. కనుక సంపాదన సామర్థ్యం ఉన్న వారు తక్కువ కాల పరిమితికే, ఎక్కువ ఈఎంఐ కట్టేలా రుణం తీసుకుంటే మంచిది.
4. డౌన్ పేమెంట్…
ఇంటి రుణం తీసుకునే సమయంలో మనం ఫైనాన్స్ ఇచ్చే సంస్థ, షరతులు, ఈఎంఐ ప్రకారం ముందుగా కొంత మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా లోన్ మొత్తంలో 20 నుంచి 30 శాతం వరకు ఉంటుంది. అయితే కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఏం చేస్తాయంటే తక్కువ డౌన్ పేమెంట్ ఆశ చూపి అనంతరం ఎక్కువ వడ్డీ రేటు వేస్తాయి. కనుక డౌన్‌పేమెంట్, వడ్డీరేటు విషయంలో ఒకసారి సరి చూసుకున్నాకే ముందుకు వెళ్లాలి. లేదంటే ఎక్కువ వడ్డీ రేటుకు బలవుతారు.
5. మరో బ్యాంకుకు మారాలంటే…
ఇంటి రుణం ఓ బ్యాంకులో తీసుకున్నాక అందులో నచ్చకపోయినా, మరేదైనా కారణాల వల్లయినా ఇతర బ్యాంకులకు ఆ రుణాన్ని బదిలీ చేసుకునే అవకాశం మనకు ఉంది. అలాంటప్పుడు కూడా పైన చెప్పిన విషయాలన్నింటినీ ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి. అయితే రుణాన్ని బదిలీ చేసే సమయంలో వినియోగదారులు కచ్చితమైన కేవైసీ డాక్యుమెంట్లను, రుణ వివరాలను అందజేయాలి. ఏదైనా తప్పులుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
6. ఇంటి రుణంపై ఇన్సూరెన్స్…
ఇంటి రుణం తీసుకునేటప్పుడు స్వల్ప ప్రీమియాన్ని చెల్లిస్తే ఆ రుణం తీసుకునే వ్యక్తికి కొన్ని కంపెనీలు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాయి. దీన్ని కచ్చితంగా రుణ గ్రహీతలు తీసుకోవాలి. లేదంటే ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు రుణ గ్రహీతకు చెందిన కుటుంబ సభ్యుల మీద ఆ భారం పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే ఇంటి రుణం తీసుకునే సమయంలోనే ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి.
7. ప్రభుత్వ రంగ బ్యాంకులు బెటర్…
ఇంటి రుణం తీసుకునేందుకు ప్రైవేటు రంగ బ్యాంకులు కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆశ్రయిస్తే మంచిది. ఎందుకంటే వాటిలో వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయి. అంతే కాదు ఈఎంఐ చెల్లింపులో ఏదైనా ఆలస్యం జరిగితే అంత ఇబ్బందులు ఎదురు కావు. ఒక వేళ లోన్ ముందుగా చెల్లించేస్తే వడ్డీ చాలా తక్కువగా పడుతుంది. కనుక ఇంటి రుణాలకు ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా ఉత్తమం. వాటితో దాదాపుగా ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం రాదు.