ఒకప్పుడంటే క్రెడిట్ కార్డులను పొందాలంటే అందుకు చాలా కఠినమైన నిబంధనలు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. సాధారణ ఉద్యోగాలు చేసే వారికి కూడా రూ.లక్షల్లో లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డులను ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు అధిక శాతం మంది వద్ద ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. అయితే బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని చెప్పి కొందరు లెక్కకు మించిన క్రెడిట్ కార్డులను తీసుకుంటూ ఉంటారు. మరి ఇలా ఒకటి కన్నా ఎక్కువగా క్రెడిట్ కార్డులను అసలు మనం వాడవచ్చా ? దాంతో మనకు లాభమా, నష్టమా ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* ఆదాయం బాగా ఉంటే నాలుగైదు క్రెడిట్ కార్డులను వాడినా ఏమీ కాదు. ఎందుకంటే సాధారణంగా ఆదాయం ఎక్కువగా ఉన్నవారు సకాలంలో బిల్లు చెల్లింపులు చేస్తారు కదా. కనుక నాలుగైదేమిటి, ఇంకా ఎక్కువ క్రెడిట్ కార్డులను కూడా వారు వాడవచ్చు. కానీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్నవారు ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో క్రెడిట్ కార్డులను వాడకపోవడమే మంచిది. లేదంటే బిల్లు చెల్లింపులు ఆలస్యం అవుతాయి. లేదా బిల్లు చెల్లించడం ఇబ్బందికరంగా కూడా మారుతుంది. దీంతో ఆ ప్రభావం సిబిల్ స్కోరుపై చూపుతుంది.
* క్రెడిట్ కార్డు ఈఎంఐలు లేదా బిల్లు చెల్లింపులు ఆలస్యంగా చేసినా లేదా అసలు చేయకపోయినా.. ఆ ప్రభావం సిబిల్ స్కోరుపై పడుతుందనే విషయాన్ని క్రెడిట్ కార్డు హోల్డర్లు గ్రహించాలి. బిల్లు చెల్లింపు కొంత ఆలస్యం అయినా సరే.. సిబిల్‌లో 80 నుంచి 110 పాయింట్లు తగ్గుతాయి. దీనికి తోడు మీరు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు సరిగ్గా చేయడం లేదని బ్యాంకులు సిబిల్ లో మార్క్ చేస్తాయి. దీంతో మీరు హై రిస్క్ కస్టమర్‌గా మారుతారు. అంటే భవిష్యత్తులో మీకు ఇతర బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులు, లోన్లు వచ్చేందుకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మీకు లోన్లు, కార్డులను ఇవ్వాలంటే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తాయి. చివరకి మీకు లోన్ లేదా కార్డు ఇవ్వలేమని తేల్చి చెబుతాయి. అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించాలి. దీని వల్ల సిబిల్ స్కోరు కూడా పెరుగుతుంది.
* క్రెడిట్ కార్డులు ఉన్న వారు వాటికి నెల నెలా చేసే చెల్లింపులను బట్టి ఆ ప్రభావం సిబిల్ స్కోరుపై 35 శాతం వరకు పడుతుంది. అలాగే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే ఆ ప్రభావం సిబిల్ స్కోరుపై 30 శాతం వరకు ఉంటుంది.
* ఏ బ్యాంకుకు చెందిన క్రెడిట్ కార్డు అయినా సరే.. అందులో ఉన్న లిమిట్‌లో 60 శాతం మించి వాడకూడదు. ఎక్కువగా వాడితే మీకు అప్పులు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని బ్యాంకులు గ్రహించి ఆ మేర సిబిల్ స్కోరు తగ్గిస్తాయి.
* మీ దగ్గర క్రెడిట్ కార్డులు ఎక్కువగా ఉన్నా సరే.. మీకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని బ్యాంకులు గ్రహిస్తాయి. అందువల్ల 1 లేదా 2 క్రెడిట్ కార్డులను వాడితేనే ఉత్తమం.
* మీరు క్రెడిట్ కార్డులకు ఎక్కువగా దరఖాస్తు చేసినా సిబిల్ స్కోరు తగ్గిపోతుంది. కనుక అవసరం అనుకుంటేనే క్రెడిట్ కార్డుకు అప్లై చేయాలి. లేదంటే అనవసరంగా సిబిల్ స్కోరులో కోత విధిస్తారు.