డ్రై ఫ్రూట్స్ అన్నింటిలోకెల్లా బాదంపప్పులను అత్యంత ఆరోగ్యకరమైన ఆహారంగా చెబుతుంటారు. ఈ పప్పులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. బాదంపప్పును చాలా మంది నేరుగా తినడమే కాకుండా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. బాదంపప్పు రుచి అద్భుతంగా ఉంటుంది. కనుక ఈ పప్పును చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. అయితే బాదంపప్పును రోజూ చాలా మంది ఇష్టం వచ్చినట్లు తింటుంటారు. కానీ ఈ పప్పును ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత తినకూడదు. అలా తింటే మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలగకపోగా దుష్పరిణామాలు ఏర్పడుతాయి. కనుక బాదంపప్పును రోజూ నిర్దిష్టమైన మోతాదులో సరైన టైముకు తినాల్సి ఉంటుంది.
బాదంపప్పును రోజూ 10 పప్పుల వరకు తినాలి. అలాగే వీటిని రాత్రిపూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే బాదంపప్పును నేరుగా తినవచ్చు. కానీ అలా తింటే కొందరికి వాంతికి వచ్చినట్లు అవుతుంది. అలాంటి వారు ఈ పప్పును నీటిలో నానబెట్టి తినాల్సి ఉంటుంది. బాదంపప్పును నీటిలో నానబెట్టి పొట్టు తీసి ఉదయం పరగడుపున తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బాదంపప్పులను నేరుగా తినదలిస్తే కాస్త పెనంపై వేయించి తింటే మంచిది. ఇలా బాదంపప్పును తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి.
బాదంపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. ఎదిగే పిల్లలకు రోజూ బాదంపప్పును పెడితే వారి మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. దీంతో వారు చదువుల్లో రాణిస్తారు. డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఈ పప్పులను తింటుంటే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా బాదంపప్పుతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.