ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో మన భారతీయ రైల్వే వ్యవస్థ దాదాపుగా మొదటి స్థానంలో ఉంటుందనే చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తుంటారు. కొన్ని వేల ట్రెయిన్స్ నిత్యం ప్రయాణికులను, సరుకులను రవాణా చేస్తుంటాయి. అలాగే కొన్ని కోట్ల మంది ప్రజలు నిత్యం రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అందుకే మన భారతీయ రైల్వే ప్రపంచంలోని టాప్ రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అయితే దేశంలో ప్రస్తుతం దాదాపుగా 7500కు పైగా రైల్వే స్టేషన్లు ఉండగా, వాటిల్లో కొన్ని రైల్వే స్టేషన్లు మాత్రం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. అవేమిటో, వాటి ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న రైల్వే స్టేషన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఎందుకో తెలుసా..? ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఈ రైల్వే స్టేషన్‌లో ఉంది. ఇక ఈ స్టేషన్‌లో మొత్తం 16 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. నిత్యం ఈ స్టేషన్ ద్వారా 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
కోల్‌కతాలోని హౌరా రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో మొదటి స్థానం సంపాదించింది. ఇక్కడ నిత్యం 620 ప్యాసింజర్ ట్రెయిన్లు నడుస్తుంటాయి. ఈ స్టేషన్‌లో మొత్తం 23 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. దేశంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న రైల్వే స్టేషన్‌గా ఘమ్ స్టేషన్ పేరు గాంచింది. డార్జిలింగ్‌లో ఉన్న ఈ స్టేషన్ సముద్ర మట్టానికి ఏకంగా 2258 మీటర్ల ఎత్తులో ఉంటుంది. రెండో ప్రపంచ యుద్దం కాలంలో మిలటరీ వారికి సామగ్రిని ఈ స్టేషన్ గుండా సప్లయి చేశారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫాం ఉన్న స్టేషన్‌గా గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ పేరు గాంచింది. ఇక్కడ ప్లాట్‌ఫాం పొడవు 1366.33 మీటర్లు. అంటే 1.36 కిలోమీటర్లు. ఈ స్టేషన్ గుండా రోజూ 189 ట్రెయిన్ల వరకు వెళ్తుంటాయి.
సుందరమైన రైల్వే స్టేషన్లుగా చంద్రాపూర్, బల్లార్షా స్టేషన్లు పేరుగాంచాయి. ఇక్కడ గోడలపై అందమైన డిజైన్లు మనకు కనిపిస్తాయి. నవాపూర్ అనే రైల్వే స్టేషన్ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల సరిహద్దులో ఉంది. దీనిపై అనేక మంది జోకులు కూడా వేస్తుంటారు. జవహర్ జిల్లాలో ఉన్న భవానీ మండి అనే రైల్వే స్టేషన్ కూడా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దులో ఈ స్టేషన్ ఉంది.