దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ రూల్స్ ను గత 2 రోజుల క్రితం మార్చిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 1 నుంచి అసలు ఫాస్టాగ్‌నే ఎత్తేస్తున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందా, లేక ఈ వార్త నిజంగా అబద్ధమా అన్న విషయం తెలియదు కానీ మార్చి 1 నుంచి ఫాస్టాగ్‌ను పూర్తిగా నిలిపివేస్తారని మాత్రం వార్తలు వస్తున్నాయి. ఫాస్టాగ్ స్థానంలో ఆటోమేటెడ్ టోల్ రీడింగ్ సిస్టమ్ (ANPR) ను ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తోంది.
ఫాస్టాగ్‌ను అమలు చేసే విషయంలో అనేక సమస్యలు వస్తున్నాయని, అందుకనే కొత్త విధానాన్ని అమలు చేయనున్నారని తెలుస్తోంది. దీని వల్ల వాహనదారులు టోల్ ట్యాక్స్‌ను కట్టడం మరింత సులభతరం అవడంతోపాటు ఫేక్ ట్యాగ్‌లను నివారించవచ్చని అంటున్నారు. ANPR విధానంలో వాహనదారులు కచ్చితంగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను వాడాలి. వాహనదారుడి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయి ఉంటుంది. ఈ క్రమంలో టోల్ ప్లాజా వద్ద ఉండే అత్యధిక రిజల్యూషన్ కలిగిన కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేస్తాయి. ఆ నంబర్ కు లింక్ అయి ఉండే బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిగ్గా డబ్బు కట్ అవుతుంది. ఇలా ANPR పనిచేస్తుంది.
ఈ విధానం వల్ల వాలెట్‌లో డబ్బును మాటి మాటికీ రీచార్జి చేయాల్సిన పని ఉండదు. వాహనదారులు తమ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు పెట్టుకుంటే సరిపోతుంది. దీంతో టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు చెల్లింపులో ఆలస్యం జరగదు. చాలా వేగంగా టోల్ ట్యాక్స్‌ను చెల్లించవచ్చు. ఇప్పటికే ఈ విధానాన్ని యూరప్, అమెరికా దేశాల్లో అమలు చేస్తున్నారు. కనుకనే భారత్‌లోనూ ఈ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కేంద్రం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.