ఒకప్పుడంటే చాలా మంది ఇళ్లలో కట్టెల పొయ్యిలే ఉండేవి. కానీ ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంటిలోనూ వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో వంట చేయడం సులభతరం అయింది. ఈ క్రమంలోనే ఇండేన్, హెచ్‌పీ, భారత్.. వంటి కంపెనీలకు చెందిన గ్యాస్ సిలిండర్లను చాలా మంది ఉపయోగిస్తున్నారు. అయితే మీరెప్పుడైనా గమనించారా ? వంట గ్యాస్ సిలిండర్‌కు కింది భాగంలో రంధ్రాలు ఉంటాయి. కదా.. అయితే వాటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
* వంట గ్యాస్ సిలిండర్‌లో ఉండే గ్యాస్ బయట ఉండే గాలి కన్నా బరువుగా ఉంటుంది. ఈ క్రమంలో అది లీక్ అయితే కింది నుంచి బయటకు వస్తుంది. ఒక వేళ సిలిండర్‌కు కింది వైపున లీకేజ్ ఏర్పడితే గ్యాస్ దాని కింద బంధించబడుతుంది. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కింది భాగంలో రంధ్రాలను ఏర్పాటు చేయడం వల్ల కింద లీకయ్యే గ్యాస్ అక్కడ బంధించబడదు. ఎప్పటికప్పుడు బయటకు పోతుంది. దీంతో ప్రమాదం తప్పుతుంది. అందుకనే గ్యాస్ సిలిండర్‌కు కింది భాగంలో రంధ్రాలను ఏర్పాటు చేస్తారు.
* ఇక సిలిండర్‌లకు కింది భాగంలో రంధ్రాలను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఇంకో కారణం ఏమిటంటే.. గ్యాస్ సిలిండర్ కింద నీళ్లు చేరితే సిలిండర్ తుప్పు పట్టి త్వరగా క్షీణిస్తుంది. ఎక్కువ రోజులు రాదు. జీవిత కాలం తగ్గుతుంది. కానీ కింది భాగంలో రంధ్రాలను ఏర్పాటు చేస్తే నీరు బయటకు వెళ్లిపోతుంది. కనుక తుప్పు పట్టదు. దీంతో సిలిండర్ జీవిత కాలం (లైఫ్) పెరుగుతుంది. ఎక్కువ రోజులు ఉన్నా సిలిండర్ దెబ్బ తినదు. ఎక్కువ రోజులు ఉపయోగించుకోవచ్చు.
* వంట గ్యాస్ తయారీ కంపెనీలు తాము అందించే సిలిండర్‌కు కింది భాగంలో భిన్న రకాల రంధ్రాలను ఏర్పాటు చేస్తాయి. ఇండేన్ గ్యాస్ సిలిండర్ అయితే కింది భాగంలో సిలిండర్ ఆకారంలో రంధ్రాలు ఉంటాయి. అదే భారత్ గ్యాస్ అయితే కింది భాగంలో రంధ్రాలు వృత్తాకారంలో ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా సిలిండర్ ఏ కంపెనీకి చెందినది అనే విషయాన్ని సులభంగా గుర్తించవచ్చు.
ఇలా పలు సదుపాయాలు ఉంటాయి కనుకనే వంట గ్యాస్ సిలిండర్‌లకు కింది భాగంలో రంధ్రాలను ఏర్పాటు చేస్తారు.