inspiration

Chai Business : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేశాడు.. చాయ్ అమ్ముతూ నెల‌కు ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదిస్తున్నాడు..!

Chai Business : ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఉద్యోగాలు దొర‌క‌డం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. క‌రోనా కార‌ణంగా చాలా మంది ఉద్యోగాల‌ను కోల్పోయారు. ఎంతో మంది ఉపాధి లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే క‌రోనా స‌మ‌యంలోనే అతను బంగారం లాంటి సాఫ్ట్‌వేర్ జాబ్‌ను వ‌దులుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ దిగులు చెందలేదు. నెమ్మ‌దిగా చాయ్ బిజినెస్ ను ప్రారంభించాడు. దీంతో ఇప్పుడ‌త‌ను నెల నెలా ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సంపాదిస్తున్నాడు. అత‌నే.. మ‌హారాష్ట్ర‌కు చెందిన గ‌ణేష్ దుధ్‌నలె.

గ‌ణేష్ 2019లో కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్ చ‌దివాడు. ఓ కంపెనీలో జాబ్ కూడా వ‌చ్చింది. అయితే అత‌నికి అది తృప్తిని ఇవ్వ‌లేదు. దీంతో అత‌ను ఏదైనా బిజినెస్ చేయాల‌ని అనుకున్నాడు. వెంట‌నే త‌న తండ్రి నుంచి రూ.6 ల‌క్ష‌లు తీసుకుని తాము ఉంటున్న వాపి అనే ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేష‌న్‌లో చిన్న‌గా చాయ్ షాప్ ప్రారంభించాడు. మ‌సాలాలు, పండ్ల ఫ్లేవర్‌తో కూడిన చాయ్‌ని అత‌ను అమ్మ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో అత‌ని చాయ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇలా అత‌ను చాయ్ బిజినెస్‌ను విజ‌య‌వంతంగా ర‌న్ చేస్తున్న స‌మ‌యంలో ప్ర‌దీప్ జాద‌వ్ అనే ఇంకో యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అత‌నితో క‌లిసి త‌న సంస్థ‌ను గ‌ణేష్ మ‌రింత అభివృద్ధి చేశాడు.

ganesh dudhnale earning good money with chai makers business

అలా గ‌ణేష్ త‌న చాయ్ బిజినెస్‌ను సూర‌త్‌కు కూడా వ్యాపింప‌జేశాడు. ఈ క్ర‌మంలోనే మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ క‌లిపి ప్ర‌స్తుతం అత‌ను 7 ఔట్‌లెట్‌ల‌ను ర‌న్ చేస్తున్నాడు. ఒక్కో దాంట్లో రోజుకు రూ.8వేలు లాభం వ‌స్తుంది. అంటే ఒక ఔట్‌లెట్‌తోనే అత‌ను నెల‌కు రూ. 2.40 ల‌క్ష‌ల‌ను సంపాదిస్తున్నాడ‌న్న‌మాట‌. మొత్తం 7 ఔట్‌లెట్‌ల‌కు క‌లిపి అత‌నికి నెల‌కు రూ.17 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ల‌భిస్తోంది. దీంతో అత‌ను ఇక వెనుదిరిగి చూడ‌లేదు. ఇక ఇప్పుడు అత‌ని ముందున్న ల‌క్ష్యం ఒక్క‌టే. దేశ‌వ్యాప్తంగా త‌న చాయ్ బిజినెస్‌ను 1000 న‌గ‌రాలకు విస్త‌రింప‌జేయాల‌ని చూస్తున్నాడు. అందుకు గాను అత‌ను పార్ట్‌న‌ర్స్ కోసం చూస్తున్నాడు.

ఇక గ‌ణేష్ త‌న చాయ్ బిజినెస్‌ను చాయ్ మేక‌ర్స్ పేరిట ఔట్‌లెట్ రూపంలో న‌డిపిస్తుండ‌గా.. ప్ర‌తి ఔట్ లెట్‌లోనూ 20 కి పైగా వెరైటీల‌కు చెందిన చాయ్‌లు.. 15 వెరైటీల కాఫీలను విక్ర‌యిస్తున్నాడు. అత‌ను విక్ర‌యిస్తున్న చాయ్‌, కాఫీల‌కు విశేష రీతిలో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతోపాటు మిల్క్‌షేక్స్‌, చ‌ల్ల‌ని డ్రింక్స్‌, కుకీస్‌ను కూడా విక్ర‌యిస్తూ.. వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. త‌న‌లాంటి ఎంతో మంది యువ‌త‌కు అత‌ను ప్రేర‌ణ‌గా నిలుస్తున్నాడు.

Admin

Recent Posts