మరి కొద్ది సంవత్సరాల్లో బెంగుళూరు ఓ డెడ్‌సిటీగా మారనుంది! అదేంటి దేశంలో టెక్నాలజీ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న బెంగుళూరు మహానగరం డెడ్‌సిటీగా మారడమేమిటి? అంటే అక్కడ ఎవరూ ఉండరా? ఆ సిటీకి అలా ఎలా జరుగుతుంది? అంటూ ఆశ్చర్యపోతున్నారా? అయితే అది నిజమేనంటున్నారు పర్యావరణ వేత్తలు. ఎందుకో ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) చేసిన ఓ పరిశోధన ప్రకారం బెంగుళూరు నగరం గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహకందని స్థాయిలో అభివృద్ధి చెందిందట. అక్కడ అభివృద్ధి రేటు 525 శాతంగా ఉందట. ఇదంతా గత 40 ఏళ్ల కాలంలోనే జరిగిందట. ఈ నేపథ్యంలో అక్కడ అటవీ విస్తీర్ణం 78 శాతం వరకు, భూగర్భ జలాలు 79 శాతం వరకు తగ్గాయట. దీంతోపాటు అనేక చెరువులు కనుమరుగైపోయాయట. ఇప్పుడు బెంగుళూరు నగరంలో వాయు కాలుష్యం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అధికమైందట. నిత్యం రహదారులపైకి వస్తున్న వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటి విషపూరిత వాయువులు గాలిలోకి ఎక్కువగా చేరుతున్నాయట. దీని కారణంగా అక్కడి ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉందట.
ఇలా ఊహకందని రీతిలో అభివృద్ధి జరుగుతున్న కారణంగా మరి కొద్ది ఏళ్లలో బెంగుళూరులో సాధారణ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇప్పటి నుంచే అక్కడ చర్యలు చేపట్టకపోతే బెంగుళూరు మరి కొద్ది ఏళ్లలో డెడ్‌సిటీగా మారడం ఖాయమని అంటున్నారు. అభివృద్ధిని మొత్తం ఒకే ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తే ఈ సమస్య వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. అంతే కదా మరి! నాయకులు ఒక ప్రాంతంలో భూములు కొని తమ లాభం కోసం కేవలం అక్కడే అభివృద్ధి చేస్తారు కదా! అందుకే బెంగుళూరులో అలా జరిగింది. ఆ నగరాన్ని చూసైనా ఇతర నాయకులు కళ్లు తెరిచి అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరిగే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. లేదంటే బెంగుళూరులాగే అన్ని నగరాలు, పట్టణాలు తయారవుతాయి.