ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే నాలుగు ఎకరాలు ఉన్న వ్యవసాయదారుడు, 60 ,70 వేల జీతం ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇద్దరు సమానమే అంటారా లేదా? సమానమో కాదో తెలియాలి అంటే గణాంకాలు ఉండాలి. ఏ ప్రాతిపదికన లెక్క వేయాలో ప్రమాణాలు కూడా ఉండాలి. అవేం లేకుండా పోల్చలేం. నెలకు ఎవరు ఎంత సంపాదిస్తున్నారు అనేది చూడాలా? ఎవరు బ్యాంకులకు ఎంత కడుతున్నారో చూడాలా? నెలకు ఎవరికి ఎంత మిగులుతుంది అనేది చూడాలా? ఎవరి అప్పులు ఎంత అనేది చూడాలా? ఎవరికి ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయో చూడాలా? ఇంట్లో ఏసిలు, హోమ్ థియేటర్లు, గొప్ప ఇంటీరియర్, నాణ్యమైన టేకుతో తయారు చేసిన బెడ్ సెట్.. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలా?
వేసుకునే బట్టలని, అంటే ఏ బ్రాండ్ వాడుతున్నారు వగైరాలు చూడాలా? 60–70 వేలు ఏ నగరంలోని జీతం? హైదరాబాద్ లో ఒకరకమైన ఖర్చులు ఉంటే, బెంగళూరు లో మరో రకంగా ఉంటాయి. పూణేలో మరో రకంగా. ఒక చోట ఆ జీతం పెద్దదిగా అనిపిస్తే మరో చోట మధ్యస్తంగా అనిపిస్తుంది. నాలుగు ఎకరాలు ఎక్కడ? అందులో ఏం పండిస్తున్నారు? కొబ్బరి తోట ఉందా? మామిడి తోట? పత్తిని పండిస్తున్నారా? గుంటూరు శివార్లలో ఉందా? పొలం మారుమూల పల్లెటూర్లలో ఉందా? ఎందుకంటే ఎకరం ఒక్కో చోట ఒక్కోలా పలుకుతుంది. విజయవాడ పరిసర ప్రాంతాలలో ఎకరం కోటికి చేరుకుంటే మార్కాపురంకు ఆనుకుని ఉన్న కొన్ని పల్లెటూళ్లలో ఎకరం 3 నుండి 4 లక్షలే ఉంది.
ఇలాంటివి ఏమీ పరిగణలోకి తీసుకోకుండా – పోల్చలేం. కోతితో పెద్ద పెద్ద దుంగల్ని మోయమని అనలేం. ఏనుగుని చెట్టు ఎక్కమని అనలేం. తాబేలుతో స్విగ్గీ డెలివరీలు చేయించలేం. ఎవరు గొప్ప అంటే ఎవరి పరిధిలో వారు గొప్ప అంతే. ఇక మానసిక ప్రశాంతతని పరిగణలోకి తీసుకోమని అంటే – అయ్యా అది మానసికమైనది. సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కారు టెన్షన్ ఉంటే రైతుకు కారుమబ్బుల టెన్షన్ ఉంటుంది. బోనస్ వస్తుందా రాదా అనే టెన్షన్ ఉద్యోగికి ఉంటే, పంట చేతికి వస్తుందా రాదా అనే టెన్షన్ రైతుకు ఉంటుంది. మిగుల్చుకోవాలి అనే ఆరాటం ఇద్దరిలోనూ ఉంటుంది. ఎంత మిగులుతుంది అనే లెక్కలో జీవితం తెల్లారిపోతుంది. ఎవరి మానసిక స్థితి ఎలా ఉంటుందో, దేనికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియకుండా ఎవరు ప్రశాంత జీవితం గడుపుతున్నారో చెప్పలేం.
కాబట్టి ఎవరూ ఎవరికీ సమానం కాదు. ఒకరికి మరొకరితో పోలిక బాగోదు. తోట రాముడికి విజయం కావాలి, పదిమంది మెప్పు కావాలి, రాకుమారి కావాలి, రాకుమారితో పాటు రాజ్యామూ కావాలి. అయితే అది అక్కడితో ఆగదు. ఆగినట్టు చరిత్రలో లేదు.