రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు చాలా వరకు లారీలు, ట్రక్కులు లేదా ఇతర భారీ వాహనాల వెనుక భాగాన్ని మీరు గమనించే ఉంటారు. చాలా మంది ఆ భాగంపై అనేక రకాల సూక్తులు లేదా తమ వాళ్ల పేర్లను రాసుకుంటారు. అయితే అందరూ కామన్‌గా రాసేది మాత్రం.. HORN OK PLEASE అనే. దీన్ని మీరు చాలా లారీల వెనుక వైపు చూసే ఉంటారు. అయితే రాయనైతే రాస్తారు కానీ దీని అర్థం ఏమిటో చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే ఈ పదాలకు అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వకాలంలో.. అంటే.. మొదటి మరియు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ట్రక్కుల మీద కంటెయినర్లలో కిరోసిన్ తరలించే వారు. దీంతో వెనుక వచ్చే వాహనాలకు ఆ విషయం తెలియడం కోసం ఆన్ కిరోసిన్ (OK) అని రాసేవారు. దీంతో వెనుక వచ్చే వారు ముందున్న ఆ వాహనానికి సేఫ్ దూరంలో ప్రయాణించేవారు. అయితే కాలక్రమేణా రాను రాను ఆన్ కిరోసిన్ కాస్తా ఓకే గా మారింది.
ఇక హార్న్ ప్లీజ్ అనేది మరో పదం. పూర్వం వాహనాలకు సైడ్ మిర్రర్స్ ఉండేవి కావు. అందువల్ల వెనుక వైపు హార్న్ ప్లీజ్ అని రాసేవారు. దీంతో ఓవర్ టేక్ చేసే సమయంలో హారన్ కొట్టవచ్చన్నమాట. దీంతో ముందు ఉన్న వాహన డ్రైవర్ అలర్ట్ అయి వెనుక వాహనానికి దారి ఇస్తాడు. ఇలా హార్న్ ప్లీజ్ అనే అక్షరాలను రాయడం మొదలు పెట్టారు. ఇప్పుడు వాహనాలకు సైడ్ మిర్రర్స్ వచ్చాయి. అయినప్పటికీ చాలా మంది హార్న్ ప్లీజ్ అని రాస్తున్నారు. ఇక మొత్తం కలిపి హార్న్ ఓకే ప్లీజ్ అని ఇప్పటికీ రాస్తున్నారు. అయితే ఆర్‌టీవో నిబంధనల ప్రకారం ఈ పదాలను రాయాలని ఎక్కడా లేదు. కానీ ఒక్కసారి ప్రాచుర్యంలోకి వచ్చింది కనుక దాన్ని ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నారు. ఇదీ.. ఈ పదాల వెనుక అసలు విషయం.