మన జీవితంలో అలుపు లేకుండా ఆగకుండా ముందుకు సాగేవి రెండు. ఒకటి కాలం, రెండు మన వయస్సు. విలువైన కాలం గడిచిపోయినా, చక్కని వయస్సు అయిపోయినా అవి మళ్లీ మనకు రావు. కనుక సరైన సమయంలోనే వయస్సు ఉండగానే మనం చేయాలనుకునే పనులు చేసేయాలి. అవి మన కెరీర్‌కు సంబంధించినవి కావచ్చు, జీవితంలో సెటిల్ అవ్వాలనుకునే పనులు కావచ్చు, ఇంకా ఇతర ఏ పనులైనా కావచ్చు, వాటిని సరైన సమయంలోనే మనకు వయస్సు చక్కగా ఉన్నప్పుడే చేసేయాలి. తరువాత మనకు అవి రెండూ రావు. ఈ క్రమంలోనే ఎవరైనా 30 సంవత్సరాల వయస్సును సమీపిస్తున్నారంటే.. వారు కింద సూచించిన కొన్ని పనులను కచ్చితంగా చేసేయాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వయస్సు 30 సంవత్సరాలు సమీపిస్తుంటే ఎవరికైనా సాధారణంగా బాధ్యతలు ఇంకా అధికమవుతుంటాయి. మరో వైపు ఖర్చులు పెరుగుతాయి. సమస్యలు ఉత్పన్నమవుతాయి. కనుక అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ జీవితంలో ముందుకు సాగాలంటే మానసిక శక్తి చాలా అవసరం. మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలం. కనుక ఆ వయస్సు వస్తుండగానే మానసికంగా దృఢంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. దీంతో ఎంత పెద్ద సమస్య వచ్చినా తట్టుకునే శక్తి లభిస్తుంది. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, ఇతర వ్యవహారాలు ఎప్పుడూ ఉండేవే. అయితే వీటన్నింటికీ దూరంగా అప్పుడప్పుడు వెళ్లి రావాలి. 30 సంవత్సరాలు వస్తున్నాయనగానే వీలైనన్ని ఎక్కువ పర్యాటక ప్రదేశాలు చుట్టి రావాలి. లేదంటే ఆ తరువాత సమయం దొరకదు. చాలా కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేసే సంవత్సరాలు చాలా తక్కువగా ఉన్నాయని దృష్టిలో ఉంచుకోవాలి.
నెగెటివ్ ఆలోచనలను మదిలోకి రానీయవద్దు. అలాగే ఆలోచించే వారికి దూరంగా ఉండాలి. వీలైనన్ని ఎక్కువ పుస్తకాలను చదవాలి. పుస్తక పఠనానికి టైం కేటాయించాలి. వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం చేయాలి. ఆదాయం, ఖర్చు వివరాలను రాసుకోవాలి. ఆర్థిక ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవాలి. వంట రాని వారు నేర్చుకోవాలి. అవసరం ఉన్నప్పుడు పనికొస్తుంది. మీ జీవితానికి స్పూర్తినిచ్చే వ్యక్తులను కలవాలి. అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి. మీ తప్పులను ఎవరైనా విమర్శిస్తే మనస్ఫూర్తిగా అంగీకరించండి. వాటిని తప్పించుకోకండి. తప్పులను ఎత్తి చూపిన వారిని నిర్లక్ష్యం చేయకండి. చేసే పనిపై దృష్టి పెట్టండి. జరిగిన, జరగబోయే వాటి గురించి ఆలోచించకండి.
ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగే నేర్పును సాధించండి. నిత్యం ఎదురయ్యే సవాళ్లను అధిగమించండి. బ్రేక్ లేకుండా ముందుకు సాగండి. మీ పట్ల తప్పు చేసే వారిని క్షమించండి. చెడు జ్ఞాపకాలు, సంఘటనలను మరిచిపోండి. మీకు ఏం కావాలి, ఏం వద్దు అనే విషయాలను కచ్చితంగా విశ్లేషించి నిర్ణయం తీసుకోండి. అప్పుడప్పుడు క్రీడలలో చురుగ్గా పాల్గొనండి. మీకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదించండి. పరిచయం లేని కొత్త వంటకాల రుచిని చూడండి. మీ బాధలు, కష్టసుఖాలు, ఎమోషన్స్ అన్నింటినీ మీకు నచ్చిన వ్యక్తులతో షేర్ చేసుకోండి. వర్క్ టెన్షన్ బాగా ఉంటే కొంత సమయం పాటు బ్రేక్ తీసుకుని మళ్లీ పని మొదలు పెట్టండి. మీరు ఎలా అయితే జీవించాలని అనుకున్నారో అలాగే ఉండండి. ఇతరులు చెప్పినట్టుగా ఉండకండి.
మీలోని మార్పులకు మీరే స్వాగతం చెప్పండి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకండి. భయపడకండి. సవాల్‌గా తీసుకోండి. మీకు జీవితంలో ఉన్న లక్ష్యం ఏమిటో దాన్ని సాధించండి. దాన్ని సాధించే దిశగా ముందుకు కదలండి. మీకు వచ్చిన భాషలు కాకుండా ఇతర భాషలను నేర్చుకునేందుకు యత్నించండి. వివిధ రకాల పానీయాలను టేస్ట్ చేయండి. ఏ పానీయం ఏ రుచి ఉందో తెలుసుకోండి. మీకు పరిచయం లేని వ్యక్తులతో ఎక్కువ సేపు గడిపేందుకు యత్నించండి. ప్రతి నెలా చిన్న మొత్తమైనా సరే ఎంతో కొంత డబ్బు పొదుపు చేయండి. ఏం చేస్తే ఆనందం వస్తుందో ఆ పని చేసేయండి. ఎవరైనా ఏదైనా చెప్పినా, అడిగినా కాదు, లేదు అని అనకండి. ఇతరులు మీపై పెట్టే రూల్స్‌ను ఫాలో అవకండి. మీకు మీరే రూల్స్‌ను క్రియేట్ చేసుకుని వాటిని ఫాలో అవండి. మీ హృదయం చెప్పినట్టుగా నడుచుకోండి.