సృష్టిలో ప్రతి ఒక్క జీవి తన ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా ఇతర జీవులకు జన్మనిస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. మనుషులకు, ఇతర జీవులకు ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అనేక తేడాలు ఉంటాయి. కొన్ని జీవులు పిల్లల్ని గర్భంలో మోసి కంటాయి. కొన్ని జీవులు గుడ్లను పొదగడం ద్వారా పిల్లల్ని కంటాయి. కానీ ప్రతి జీవి మాత్రం పిల్లల్ని కనే తీరుతుంది. ఈ పద్ధతి జీవులను బట్టి మారుతుంది. అయితే కుక్కల విషయానికి వస్తే ఇవి కూడా పిల్లల్ని గర్భంలో మోసి కంటాయి. అయితే ఇవి సంభోగంలో పాల్గొనడం కొందరికి వింతగా అనిపిస్తుంది.
కుక్కలు సంభోగంలో పాల్గొనడం ఒక సహజసిద్ధమైన ప్రక్రియ. సంభోగంలో ఉన్నప్పుడు కుక్కలు సహజంగానే అతుక్కుపోయినట్లు కనిపిస్తుంటాయి. దీంతో అవి బాధలో ఉన్నాయేమోనని కొందరు వాటిని విడదీసే ప్రయత్నం చేస్తారు. కానీ అలా చేయకూడదట. ఎందుకంటే అది చాలా సహజసిద్ధమైన ప్రక్రియ అని, వాటిని సంభోగంలో ఉన్నప్పుడు విడదీస్తే వాటికి విపరీతమైన నొప్పి, బాధ ఉంటాయని నిపుణులు అంటున్నారు.
కుక్కలు సంభోగంలో ఉన్నప్పుడు అతుక్కుపోవడం అనేది సహజసిద్ధంగా జరిగేదే. మగ కుక్క తన అంగాన్ని ఆడ కుక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పెట్టినప్పుడు ఆడకుక్క జననావయవాలు ముడుచుకుపోతాయి. అదే క్రమంలో మగ కుక్క అంగం వ్యాకోచానికి గురవుతుంది. దీంతో వాపు వచ్చినట్లు కనిపిస్తుంది. ఫలితంగా రెండు కుక్కలకు చెందిన జననావయవాలు అతుక్కుపోతాయి. ఆయా అవయవాల కండరాలు మళ్లీ సాధారణ స్థితికి రాగానే అవి విడిపోతాయి. ఇలా కుక్కల సంభోగం జరుగుతుంది. ఇది 10 నిమిషాల నుంచి 30 లేదా 60 నిమిషాల వరకు జరుగుతుంది. కానీ ఆ సమయంలో కుక్కలను విడదీస్తే తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి విపరీతమైన బాధకు లోనవుతాయి. కనుక ఆ సమయంలో వాటిని పట్టించుకోకూడదు. విడదీయాలని ప్రయత్నించకూడదు.