Parents With Kids : పిల్లలను పెంచడం అనేది అంత సులభం కాదు. తల్లిదండ్రుల ప్రతిచర్య, ప్రభావాలు పిల్లల మనస్తత్వాన్ని మలుస్తాయి. పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తూ పెరుగుతారు. అందువలన పిల్లల ముందు చెడు ప్రవర్తన లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు పిల్లల ప్రవర్తనను సరి చేయటానికి ప్రయత్నించడానికి ముందు పిల్లలు మీ తప్పుల ద్వారా ప్రభావితం కాకుండా ఉండేలా మీరు సరిగ్గా ఉండటం ముఖ్యం. మరి ఇప్పుడు పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడూ చేయకూడని కొన్ని పనుల గురించి తెలుసుకుందాం.
మీ పిల్లలను ఎప్పుడూ కూడా అవమానించరాదు. ముఖ్యంగా బయట నలుగురిలోనూ అసలు ఈ పని చేయరాదు. చేస్తే మీరంటే వారికి అసహ్యం ఏర్పడుతుంది. మీపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. అందువల్ల పిల్లలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి కానీ వారిని అవమానించరాదు. అలాగే పిల్లల ఎదుట ఎప్పుడూ బూతులను వాడరాదు. ఇవి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.
ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణతో మెలగాలి. అస్తవ్యస్తంగా ఉండరాదు. ఉంటే అదే పిల్లలకు అలవడుతుంది. దీంతో వారు క్రమశిక్షణను నేర్చుకోరు. ఆవారాగా మారుతారు. చాలామంది తల్లిదండ్రులు కొన్ని విషయాలను దాచడానికి అబద్ధం చెప్పమని పిల్లలను అడుగుతారు. పిల్లలు ఒక్కసారి అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నారు అంటే భవిష్యత్తులో కూడా దానికి ఎక్కువగా అలవాటు పడిపోతారు. తల్లిదండ్రులకు కూడా అబద్ధాలు చెప్పడమే ప్రారంభిస్తారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక అబద్దాలు ఆడమని పిల్లలను ప్రోత్సహించరాదు. ఇది కూడా వారిపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది.
ఇక పిల్లల ఎదుట ఎప్పుడూ చనువుగా ఉండరాదు. అలా ఉండడాన్ని వారు చూస్తే చిన్న వయస్సులోనే వారి మనసు చెడు వ్యసనాలు, అలవాట్ల వైపు మళ్లుతుంది. కనుక ఇంట్లో పిల్లలు ఉన్నంత సేపు, వారి ఎదుట సత్ప్రవర్తనతో మెలగాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితిలోనూ చనువుగా ఉండరాదు. ఇలా పలు సూచనలు పాటించడం వల్ల పిల్లలు సన్మార్గంలో పెరుగుతారు. చక్కని ప్రవర్తన, క్రమశిక్షణ అలవడుతాయి. ఉన్నత శిఖరాలకు చేరుకుని ప్రయోజకులు అవుతారు.