భాష కాని భాష… ఊరు కాని ఊరు… దేశం కాని దేశం… వెళ్లినప్పుడు ఎవరైనా ఆయా అంశాల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇవి ఎక్కడైనా సహజమే. అయితే తెలిసో తెలియకో ఏదైనా పొరపాటు చేస్తే… అంటే మన దృష్టిలో అది పొరపాటు కాకపోవచ్చు, కానీ ఆ దేశంలో ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా చూస్తే మనం చేసే కొన్ని పనులు వారికి పొరపాట్లుగా, తప్పులుగా అనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఎవరైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. తెలిసి చేసినా, తెలియక చేసినా చట్ట ప్రకారం తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. ఈ క్రమంలో ఆయా దేశాల్లో ఆయా పనులకు గాను అమలులో ఉన్న అలాంటి వింత చట్టాలు, శిక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనమైతే ఇంట్లో ఏదైనా చిన్న కరెంటు పని పడితే మనకు మనమే చేసుకుంటాం. కానీ ఆస్ట్రేలియాలో విక్టోరియా అనే ప్రాంతంలో అలా కాదట. చిన్న విద్యుత్ బల్బు మార్చాలన్నా అందుకు క్వాలిఫైడ్ ఎలక్ట్రిషియన్ కావల్సిందేనట. వారే ఆ పని చేయాలట. అలా కాకుండా రూల్‌ను అతిక్రమిస్తే వారికి 10 ఆస్ట్రేలియన్ డాలర్లు జరిమానా వేస్తారట. ఇటలీలోని మిలన్ నగరంలో ప్రజలు శ్మశానాలు, అంత్యక్రియలు, హాస్పిటల్స్‌లో తప్ప ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలట. అలా నవ్వకపోతే వారు భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి వస్తుందట. ఫ్లోరిడాలో గురువారాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ వదలకూడదట. అలా చేస్తే జరిమానా వేస్తారట.
ఇంగ్లండ్‌లో పార్లమెంట్ భవనంలో చనిపోవడం చట్టరీత్యా నేరం. దీన్ని 2007లో అమలులోకి తెచ్చారు. ఓక్లహామాలో రాత్రి 7 గంటల తరువాత బాత్ టబ్‌లో స్నానం చేస్తూ పక్కనే గాడిదను పెట్టుకోవడం చట్ట రీత్యా నేరం. అందుకు జరిమానా భరించాల్సి ఉంటుంది. కెనడాలో అక్కడి రేడియోల్లో ప్రసారమయ్యే పాటల్లో ప్రతి 5 పాటల్లో ఒకటి కెనడా సింగర్‌కు చెందినదై ఉండాలి. ఇది అక్కడి చట్టం. జపాన్‌లో 40 ఏళ్లు దాటిన పురుషుల నడుం 31 ఇంచులకు మించరాదు. అదే స్త్రీలకైతే ఆ కొలత 35 ఇంచుల వరకు ఓకే. అదేవిధంగా అక్కడి ప్రజలు పరిమితికి మించి బరువు కూడా ఉండకూడదు. ఇంకా ఇందులో తమాషా ఏంటంటే… ఆ దేశమే అత్యంత బరువు కలిగిన సుమోల ఫైటింగ్ ను ప్రపంచానికి పరిచయం చేసింది.
స్విట్లర్లాండ్‌లో రాత్రి 10 గంటల తరువాత టాయిలెట్ ఫ్లష్ చేయడం చట్ట రీత్యా నేరం. అలా చేస్తే చట్ట రీత్యా శిక్షింపబడతారు. చికాగోలో మంటలు అంటుకున్న ఏదైనా ప్రదేశంలో ఆహారం తినడం నేరం. అలా చేస్తే జరిమానా పడుతుంది. జర్మనీలోని ఆటోబాహ్న్‌లో రన్నింగ్‌లో ఉన్న వాహనంలో ఇంధనం అయిపోవడం చట్ట రీత్యా నేరం. కనుక ఇంధనం అయిపోకముందే దాని లెవల్స్‌ను చూస్తూ అందులో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నింపుకోవాలి. అంతేకానీ దారి మధ్యలో ఇంధనం అయిపోవడం వల్ల వాహనాన్ని ఆపకూడదు. అలా చేస్తే 80 యూరోల ఫైన్ పడుతుంది.