సాధారణంగా అందరికి మంచి శారీరక రూపం కావాలని, ఆకర్షణ కలిగి వుండాలని వుంటుంది. అందుకుగాను ఎంపిక చేసుకునే ఆహారాలే తినటానికి ప్రయత్నిస్తారు. కాని కొన్ని సమయాలలో బయట దొరికినవి తినాల్సి వస్తుంది.తరచుగా బయట ఆహారాలు తినేస్తున్నారా? అటువంటివారికి బరువు ఎక్కకుండా తెలివిగా బయటి ఆహారాలు తినేటందుకు కొన్ని చిట్కాలు చూడండి. హోటళ్ళు, రెస్టరెంట్లలో తినేవారు వీలైనంతవరకు నూనెలో వేయించిన వేపుళ్ళు, పెనంపై కాల్చిన పదార్ధాలు తినవద్దు. దానికి బదులు, ఉడికించిన ఆహారాలు తినండి. చికెన్ వంటి పదార్ధాలు కూడా, ఛీస్ వంటి వాటితో కాక, మితంగా వేయించిన సైడ్ డిష్ లతో తినండి.
భోజనానికిముందు ఒక గ్లాసెడు నీరు తాగేస్తే జీర్ణ ప్రక్రియకు తోడ్పడటమే కాక కడుపు నిండినట్లు భావించి బయటి పదార్ధాలు తక్కువ తింటారు. మీరు ఆర్డర్ చేసే వంటకంలో ఏం వుంటాయనేది సర్వర్ ను అడగండి. కొవ్వు రహిత డిష్ లు చెప్పమనండి. సలాడ్ లేదా సూప్ వంటివే అధికంగా తింటూ మెయిన్ వంటకం తగ్గించండి. స్నాక్స్ గా బ్రెడ్ రోల్స్, ఛీజ్ వంటివి తినవద్దు. వైట్ బ్రెడ్ కు బదులు బ్రౌన్ బ్రెడ్ కోరండి.
తినే పదార్ధం ఎంత ముఖ్యమో ఎంత నెమ్మదిగా తింటున్నారనేది కూడా అంతే ముఖ్యం. కనుక మెల్లగా నమలండి, ప్రతి ముద్దా ఆనందించండి. బ్రెయిన్ 20 నిమిషాలు తింటే గాని పూర్తయినట్లు భావించదు. కనుక మెల్లగా తింటే, అధిక మొత్తం లోపలికి పోకుండా వుంటుంది. మనలో చాలామంది బఫే లంచ్ చేస్తారు. పాస్తాలు, ఛీజ్, బటర్, క్రీమ్, నెయ్యి వంటివి వదిలేసి సలాడ్లు, వెజిటబుల్స్, నూనె తక్కువగా వుండే రోటి, పాల ఉత్పత్తులైన పెరుగు, పెరుగు పచ్చడి వంటివి ఆరోగ్యకరంగా తినండి.