ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి… భయాన్ని పురికొల్పుతాయి… వింతైన అనుభూతిని కలిగిస్తాయి… అవే కలలు..! భూమిపై పుట్టిన ప్రతి మనిషికి నిద్రపోతే కచ్చితంగా కలలు వస్తాయి. కలలు రాని వ్యక్తులు అస్సలే ఉండరు. ఈ క్రమంలో ఒక్కొక్కరికి వచ్చే కలలు ఒక్కో రకంగా ఉంటాయి. అయితే చాలా వరకు కలలను ఎవరూ గుర్తుపెట్టుకోలేరు. వెంటనే మరిచిపోతారు. కానీ ఏ కల వచ్చినా… అది మనకు బ్లాక్ అండ్ వైట్‌లో కనిపిస్తుందా..? లేదంటే కలర్‌లో కనిపిస్తుందా..? అన్నదే ఇప్పుడు మేం చెప్పబోయేది. దాని గురించే ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా మనకు వచ్చే కలలు అన్నీ దాదాపుగా కలర్‌లోనే ఉంటాయట. 80 శాతం వరకు కలలన్నీ రంగుల్లోనే ఉంటాయట. కేవలం 20 శాతం కలలు మాత్రమే బ్లాక్ అండ్ వైట్‌లో వస్తాయట. కానీ ఏ రంగు కల వచ్చినా మనకు ఆ రంగు అస్సలు గుర్తుండదట. కేవలం కలల్లో వచ్చే పలు భావాలు మాత్రమే మనకు గుర్తుంటాయట. అంటే మనం కలలో భయ పడింది, నవ్వింది, పరిగెత్తింది, నడిచింది… లాంటి క్రియలకు చెందిన భావాలు మాత్రమే గుర్తుంటాయట. అయితే బ్లాక్ అండ్ వైట్ లో కలలు ఎందుకు వస్తాయనేది మాత్రం ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు.
కాగా కొందరు మహిళలు, వృద్ధులు, అంధులు, పిల్లలు… వంటి వారికి బ్లాక్ అండ్ వైట్ లో కలలు వస్తాయట. దీనికి కూడా సరిగ్గా కారణాలు తెలియవు. అయితే తీవ్రమైన సమస్యలతో బాధపడుతూ డిప్రెషన్‌లో ఉన్నవారికి కూడా కలలు బ్లాక్ అండ్ వైట్‌లో వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఆరోగ్య పరంగా బాగా హెల్దీగా ఉన్నవారికి 99 శాతం వరకు కలలు రంగుల్లోనే వస్తాయట. అయితే బ్లాక్ అండ్ వైట్‌లో ఎవరికైనా కల వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదట. వాటితో అంత చింతించాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు.