వర్షాకాలం కావడంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే డెంగ్యూ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అందువల్ల డెంగ్యూ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కోవిడ్ కూడా ఇంకా వ్యాప్తి చెందుతుంది కనుక కోవిడ్ సోకిందా, డెంగ్యూ వచ్చిందా ? అన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. కానీ కింద తెలిపిన లక్షణాలను గమనిస్తే కోవిడ్, డెంగ్యూలను సులభంగా గుర్తించవచ్చు. మరి ఆ లక్షణాలు ఏమిటంటే..
కోవిడ్, డెంగ్యూ.. రెండూ ఇన్‌ఫెక్షన్ సంబంధిత వ్యాధులే. వైరస్‌ల కారణంగానే వస్తాయి. రెండు వ్యాధుల్లోనూ జ్వరం, ఒళ్ల నొప్పులు కామన్‌గా ఉంటాయి. రెండు వ్యాధుల్లోనూ లక్షణాలు స్వల్పంగా ఉండి మధ్యస్థం వరకు వెళ్లి తగ్గవచ్చు. లేదా లక్షణాలు తీవ్రతరం కావచ్చు.
కోవిడ్ 19 ఉన్నవారి నుంచి వెదజల్లబడే తుంపర్ల కారణంగా కోవిడ్ వ్యాప్తి చెందుతుంది. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది.
కోవిడ్ వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు
గొంతు నొప్పి, వణకడం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, రుచి, వాసన చూసే శక్తి కోల్పోవడం వంటి లక్షణాలు సహజంగానే కనిపిస్తాయి. అలాగే జ్వరం, పొడి దగ్గు, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
డెంగ్యూ వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు
తలనొప్పి, దద్దుర్లు, వాంతులు అవడం వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే కడుపు నొప్పి, వెన్ను నొప్పి, కళ్ల వెనుక నొప్పిగా ఉండడం, ఎముకలు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, వణకడం, అలసట, జ్వరం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అయితే కోవిడ్ 19, డెంగ్యూ రెండింటి లక్షణాలు ఒకే విధంగా ఉన్నా పరీక్షల ద్వారా తెలిసిపోతుంది. ఈ లక్షణాలు కామన్ గా ఉంటే ఎందుకైనా మంచిది రెండు రకాల టెస్టులు చేయించుకోవాలి. దీంతో అసలు ఏ వ్యాధి అయిందీ నిర్దారించవచ్చు. ఈ క్రమంలో వ్యాధి నిర్దారణ అయ్యాక చికిత్స తీసుకోవచ్చు. దాని నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ విధంగా డెంగ్యూ, కోవిడ్ 19లను గుర్తించి స్పందించాల్సి ఉంటుంది.