Heart Attack Signs : గుండె పోటు సైలెంట్ కిల్లర్.. అది వచ్చేదాకా చాలా సైలెంట్‌గా ఉంటుంది. కానీ ఒకసారి హార్ట్ స్ట్రోక్ వస్తే మాత్రం.. బాధితులు విలవిలలాడిపోతారు. అది వచ్చేదాకా ఎలాంటి లక్షణాలు మనకు కనబడవు. కానీ హార్ట్ స్ట్రోక్ వస్తుందంటే చాలు.. కొన్ని లక్షణాలను మాత్రం మనం సులభంగా కనిపెట్టవచ్చు. అవేమిటంటే.. గుండె పోటు వస్తుందనగా.. తీవ్రమైన అలసట కలుగుతుంది. అవయవాలకు రక్త ప్రవాహం ఆగిపోతుంది. దీని వల్ల ఆక్సిజన్ సరఫరా జరగదు. దీంతో అలసట వస్తుంది. అయితే ఎవరికైనా అప్పటి వరకు బాగానే ఉండి, వెంటనే అలసటగా అనిపిస్తే అనుమానించాలి. అది హార్ట్ ఎటాక్‌కు సంకేతం కావచ్చు. అలాంటి వారు అప్రమత్తగా ఉండి వెంటనే స్పందిస్తే పెను ప్రమాదం జరగకుండా చూసుకోవచ్చు.
హార్ట్ ఎటాక్ వచ్చేముందు గొంతు, మెడ, దవడలో తీవ్రమైన నొప్పిగా ఉంటుంది. అది నెమ్మదిగా ఏదైనా భుజం మీదుగా చేయి కిందకు వ్యాపిస్తుంది. అలాగే ఛాతి మధ్యలో ముందు లేదా వెనుక నొప్పి వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయరాదు. తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి. గుండె పోటు వచ్చేముందు కొందరికి కడుపులో తిప్పినట్లు అవుతుంది. వికారం, వాంతులు అవుతాయి. ఈ లక్షణాలను కూడా జాగ్రత్తగా గమనించాలి. సాధారణంగా కొందరికి ఆహారం తిన్న వెంటనే ఛాతిలో మంట అనిపిస్తుంది. అది గ్యాస్ లేదా అసిడిటీ అయి ఉండవచ్చని కొందరు అనుకుంటారు. అది నిజమే అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో మాత్రం.. అది హార్ట్ ఎటాక్ వచ్చేముందు కనిపించే సంకేతం కావచ్చు. కనుక ఈ లక్షణం పట్ల కూడా జాగ్రత్తగా ఉండి వెంటనే స్పందించాలి.
గుండె పోటు వచ్చేముందు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. శ్వాస సరిగ్గా ఆడదు. గుండె పోటు వచ్చేముందు లేదా వస్తున్న సమయంలో మాట్లాడితే మాటలు తడబడుతుంటాయి. అలాగే మైకం వచ్చినట్లు అనిపిస్తుంది. తలతిరిగి పడిపోతారు. పైన లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. దీంతో గుండెకు భారీగా నష్టం కలగకుండా నివారించవచ్చు.