Heart Palpitations : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న గుండె సంబంధిత సమస్యలల్లో గుండె దడ కూడా ఒకటి. ఈ సమస్యలో సాధారణం కంటే కూడా గుండె ఎక్కువగా కొట్టుకుంటుంది. చాలా మంది ఈ సమస్యను తేలికగా తీసుకుంటారు. గుండెదడ ఒకటి లేదా రెండు రోజులు ఉండి దానికి అదే తగ్గుతుందని చాలా మంది భావిస్తారు. దీనికి సరైన వైద్యాన్ని కూడా తీసుకోరు. కానీ రోజుల తరబడి ఇలా గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల కొన్ని రోజులకు గుండె బలహీనంగా తయారవుతుంది. ఇది క్రమంగా గుండె వైఫల్యానికి దారి తీస్తుంది. సాధారణంగా ఒత్తిడి, ఆందోళన, భయం వంటి సందర్భాల్లో గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాగే గుండె చలనం తప్పినప్పుడు, గుండె కొట్టుకునే లయ తప్పినప్పుడు కూడా గుండె దడగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా జ్వరం వంటి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు కూడా గుండెదడగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు కూడా గుండెదడగా ఉంటుంది.
అయితే గుండె దడతో పాటు ఛాతిలో నొప్పి, కళ్లు తిరిగినట్టు ఉండడం, చెమటలు పట్టడం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. గుండె పనితీరును తెలుసుకోవడానికి ఇసిజి పరీక్ష చేయించుకోవడం వల్ల గుండె పనితీరును మనం తెలుసుకోవచ్చు. అలాగే 2డి ఎకో లేదా 3డి ఎకో ద్వారా కూడా మనం గుండె పనితీరును తెలుసుకోవచ్చు. ఈ రెండు పరీక్షలు చేయడం వల్ల దాదాపుగా మనకు గుండెలో ఉన్న సమస్య తెలిసిపోతుంది. అయితే కొన్నిసార్లు గుండెదడ వచ్చినప్పటికి వెంటనే తగ్గిపోతుంది. ఇసిజి పరీక్ష చేసేటప్పుడు గుండె సాధారణంగా కొట్టుకున్నట్టే కనిపిస్తుంది.
అలాంటప్పుడు రెండు నుండి మూడు రోజుల పాటు గుండె కొట్టుకునే వేగాన్ని పరీక్షిస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా పరీక్షలు చేయడం వల్ల ఆందోళన కారణంగా గుండె వేగంగా కొట్టుకుంటుందా లేదా గుండెలో సమస్య ఉండడం వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుందా అని మనం తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండెలో సమస్య ఉండడం వల్ల వచ్చే గుండె దడకు అలాగే ఆందోళన కారణంగా వచ్చే గుండె దడకు చికిత్ప వేరుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక గుండెదడ ఉంటే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.